Share News

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:14 PM

కేంద్రంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీజేపీ, కాంగ్రెస్‌పై టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరికి చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు టీవీకే నూటికి నూరు శాతం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్
TVK chief Vijay

పుదుచ్చేరి: కేంద్రంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ పుదుచ్చేరి (Puducherry)కి రాష్ట్ర హోదా కల్పించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీజేపీ, కాంగ్రెస్‌పై టీవీకే చీఫ్ విజయ్ (Vijay) విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరికి చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు టీవీకే నూటికి నూరు శాతం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారంనాడిక్కడ జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.


పుదుచ్చేరిలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమిని 'అయోమయ కూటమి'గా విజయ్ అభివర్ణించారు. ఏఐఎన్ఆర్‌సీ-బీజేపీ కూటమి శక్తిహీనంగా మారిందని చెప్పారు. టీవీకే విజిల్ గుర్తుకు ఓటు వేసి తమ పార్టీగా మద్దతుగా నిలవాలని, కేవలం ఒక్క వేలితో రాజకీయ మార్పు (వన్ ఫింగర్ రివల్యూషన్) తీసుకురావాలని ప్రజలను కోరారు. తమ పార్టీ అభ్యర్థులు ప్రజలకు అండగా నిలబడతారని తెలిపారు. టీవీకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.


రూ.25 లక్షల ఆరోగ్య బీమా

టీవీకే అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, పేదరికపు రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. పుదుచ్చేరి యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పుదుచ్చేరి అబివృద్ధికి కట్టుబడి ఉంటామని, సురక్షితమైన, పారదర్శక పాలనను అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

శశిథరూర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న జనం.. సెక్యూరిటీ గార్డ్‌పై దాడి..

రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

Updated Date - Apr 04 , 2026 | 03:27 PM