Share News

రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:28 AM

కేరళంలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేరళం సీఎం పినరయి విజయన్‌ ఘాటుగా స్పందించారు.

రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

  • రేవంత్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేరళం సీఎం పినరయి

తిరువనంతపురం, ఏప్రిల్‌ 3: కేరళంలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేరళం సీఎం పినరయి విజయన్‌ ఘాటుగా స్పందించారు. తనపై, కేరళం అభివృద్ధి నమూనాపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివని, సత్యదూరమైనవని కొట్టిపారేశారు. రేవంత్‌ విమర్శలపై శుక్రవారం ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా స్పందించిన ఆయన.. కేరళం అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడుతూ కేరళం ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. తన రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చివేయడం వంటి సమస్యలను పక్కనపెట్టి, కేరళంపై ఉపదేశాలు చేయడం సరైంది కాదని విమర్శించారు. కేరళం అభివృద్ధి నమూనా గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. కేరళం సుస్థిర, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. కేరళంలో అవినీతి, పరిపాలనా వైఫల్యం ఉందని రేవంత్‌ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. నీతి ఆయోగ్‌ సుస్థిరాభివృద్ధి సూచిక (2023-24)లో కేరళం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని తెలిపారు. కేరళంలో పేదరికం కేవలం 0.55 శాతమేనని, తెలంగాణలో అది 5.88 శాతంగా ఉందని చెప్పారు. అలాగే, కేరళం అక్షరాస్యత రేటు 95.3 శాతం కాగా, తెలంగాణలో అది 76.9 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. శిశు మరణాల రేటు కేరళంలో 1000 జననాలకు 5 మాత్రమే ఉండగా, తెలంగాణలో అది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అన్నారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో కేరళం ప్రజలు జాతీయ సగటు కంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కూడా విజయన్‌ విమర్శలు చేశారు. సొంత ప్రభుత్వంలో జీతాలు, పింఛన్లు ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో, ఇతర రాష్ట్రాలపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కాగా, అంతకుముందు కేరళంలో యూడీఎఫ్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. విజయన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, సీపీఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే అవినీతికి పాల్పడిన సీపీఎం నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలేస్తున్నాయని ఆరోపించారు.

Updated Date - Apr 04 , 2026 | 05:28 AM