విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:46 AM
తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు విజయ్ చిక్కుల్లో పడ్డారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్...
చెన్నై, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు విజయ్ చిక్కుల్లో పడ్డారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు ఆయన దాఖలు చేసిన నామినేషన్ల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు తాజాగా బయటకు వచ్చాయి. గత మార్చి 30న పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సందర్భంగా తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్న ఆయన.. గురువారం తిరుచ్చి తూర్పు స్థానానికి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌లో రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనడం చర్చకు దారితీయడంతో పాటు వివాదం రేపింది. వాస్తవానికి 2025 ఆగస్టులో పెరవళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో విజయ్‌పై కేసు నమోదైంది. దీనికి తోడు ఇటీవల పెరంబూరు నామినేషన్ దాఖలు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌షో చేపట్టారంటూ ఎన్నికల అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండింటి గురించి తిరుచ్చి తూర్పు నామినేషన్ అఫిడవిట్‌లో వివరించారు కానీ.. గతేడాది పెరవళ్లూరులో నమోదైన కేసు వివరాలను దీనికి ముందు దాఖలు చేసిన పెరంబూర్ నామినేషన్ పత్రంలో వెల్లడించలేదు. దీంతో విజయ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్లలోని వ్యత్యాసాలను వివరిస్తూ సవరించిన అఫిడవిట్‌ను మళ్లీ ఎన్నికల కమిషన్‌కు అందించవచ్చని, తద్వారా జరిగిన తప్పిదాన్ని సరి చేసుకోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.