Share News

ట్రంప్ నియంత్రణలో మోదీ, ఆయన నియంత్రణలో పినరయి... రాహుల్ విసుర్లు

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:08 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రణలో ఉన్నారని, అత్యంత అవమైనకరమైన విషయం ఏమిటంటే ట్రంప్‌ను 'సర్' అని ఆయన పిలుస్తారని చెప్పారు.

ట్రంప్ నియంత్రణలో మోదీ, ఆయన నియంత్రణలో పినరయి... రాహుల్ విసుర్లు
Rahul Gandhi

ఇడుక్కి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రణలో ఉన్నారని, అత్యంత అవమైనకరమైన విషయం ఏమిటంటే ట్రంప్‌ను 'సర్' అని ఆయన పిలుస్తారని చెప్పారు. మోదీ ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నానని అనుకుంటున్నారని విమర్శించారు. మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నట్టే పినరయి విజయన్‌ను మోదీ నియంత్రిస్తున్నారని అన్నారు. కేరళంలోని ఇడుక్కిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీతో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కుమ్మక్కయిందని ఆరోపించారు.


'బీజేపీ, ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య సంబంధాలను ఇవాళ ప్రతి ఒక్కరూ చూడొచ్చు. లెఫ్ట్ ఫ్రంట్‌లో సిద్ధాంతాల కోసం ఎళ్లతరబడి పనిచేసిన అవకాశవాదులు కాని కొందరు ఇప్పుడు తమను పార్టీ వంచించిందని ఆవేదన చెందుతున్నారు' అని రాహుల్ తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తో కుమ్మక్కయినందునే ఎల్‌డీఎఫ్‌ తన వామపక్ష భావజాలాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఎప్పుడూ సైద్ధాంతిక ప్రత్యర్థిగా ఎల్‌డీఎఫ్‌తో పోరాడేదని, ఇప్పుడు ఎల్డీఎఫ్ మారిపోయిందని, ఎల్‌డీఎఫ్‌లో 'లెఫ్ట్' అనేదే లేదని, ఎన్నికల తర్వాత అందులో ఏదీ మిగలదని అన్నారు.


కేరళలోని ప్రభుత్వాన్ని ఒక చీకటి శక్తి ప్రభావితం చేస్తోందని, అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలపై దాడి చేస్తోందని పరోక్షంగా బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లిగా మతం, ఆలయాలు గురించి మాట్లాడతారని, కేరళ అంశాల విషయానికి వచ్చేసరికి మాత్రం పెదవి విప్పరని శబరిమల బంగారం కేసును ప్రస్తావిస్తూ అన్నారు. ఎల్‌డీఎఫ్‌కు హెల్ప్ చేయాలని ఆయన అనుకోవడమే అందుకు కారణమని వివరించారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌తో పోరాడుతున్నందున తనపై చాలా కేసులు పెట్టారని, ఇంటరాగేట్ చేశారని, అయినా కూడా తాను వెనుదీయలేదని చెప్పారు. మోదీ ప్రతిరోజూ తనపై విమర్శల దాడి చేస్తారని, కానీ కేరళ సీఎం గురించి కానీ, ఆయన కుటుంబం గురించి కానీ ఒక్క మాట మాట్లాడరని అన్నారు. జాతీయ అంశాలపై మోదీని ఎల్డీఎఫ్ ఎప్పుడూ సవాలు చేయకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్

శశిథరూర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న జనం.. సెక్యూరిటీ గార్డ్‌పై దాడి..

Updated Date - Apr 04 , 2026 | 04:12 PM