దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవ్
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:16 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విజయవంతంగా జనాభా నియంత్రణ చేసిన...
సమర్థవంతంగా జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడతాం
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపునకు రాజ్యాంగ సవరణ చేస్తాం
18 వరకూ సమావేశాల పొడిగింపు
కేరళం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ/తిరువల్ల, ఏప్రిల్ 4: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విజయవంతంగా జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం తప్పు అని చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పథనంతిట్ట జిల్లా తిరువల్లలో శనివారం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. లోక్‌సభ సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలన్నింటికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు విజయవంతంగా జనాభాను నియంత్రించాయి. జనాభా వృద్ధి తక్కువగా ఉన్నా ఈ రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు తప్పనిసరిగా తగ్గవు’ అని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను పరిరక్షించడానికి పార్లమెంటు అవసరమైన చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పన కోసం పార్లమెంటు, రాష్ట్రాల శాసనభల స్థానాల పెంపుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయడానికి ఈ నెల 16-18 తేదీలకు పార్లమెంటు సమావేశాలను పొడిగిస్తామన్నారు. దీంతో లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేతలు తమ ప్రమాదకర వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మోదీ ఆరోపించారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌ను గల్ఫ్ దేశాలు శత్రుదేశంగా పరిగణించాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. గల్ఫ్ దేశాలకు ఆగ్రహం తెప్పించేలా కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఉన్నాయన్నారు. ‘కాంగ్రెస్, ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ నాయకులకు నేనో విషయం చెప్పదలుచుకున్నా. రాజకీయాల స్థానం రాజకీయాలదే. ఎన్నికలు వచ్చి పోతుంటాయి. నాకు మాత్రం లక్షల మంది మలయాళీల భద్రతే ప్రాధాన్యం. అందుకు కట్టుబడి ఉంటాన్నేను.’
అని ఆయన చెప్పారు. గల్ఫ్ దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయన్న మోదీ.. భారతీయులను గల్ఫ్ దేశాలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తాయన్నారు. ఆ దేశాల్లో నివసిస్తున్న యువతకు, కూతుళ్లకు సమస్యలు రానివ్వొద్దని చెప్పారు. కేరళంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని మోదీ పేర్కొన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందన్నారు. క్రైస్తవుల జనాభా గణనీయంగా గల ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరింటితోపాటు గోవాలో మాదిరిగా బీజేపీ అధికారంలోకి వస్తే కేరళం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అపార శక్తి సామర్థ్యాలు ఉన్నా, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందన్నారు. అధికారంలో లేకున్నా కేరళం అభివృద్ధికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వీడలేదని చెప్పారు. శబరి రైలు ప్రాజెక్టును ఎల్‌డీఎఫ్ సర్కారు జాప్యం చేయడం వల్ల తిరువల్ల ప్రాంత ప్రజలు గణనీయంగా నష్టపోతున్నారన్న ప్రధాని మోదీ.. బీజేపీ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే.. రాష్ట్ర అభివృద్ధికి గల ఆటంకాలన్నీ తొలగిపోతాయని, ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు