Share News

ప్రైజ్ ట్యాగ్: కామెరూన్ గ్రీన్ మరోసారి విఫలం..కేకేఆర్ రూ.25.20కోట్లు దండగేనా?

ABN , Publish Date - Apr 06 , 2026 | 09:43 PM

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కేకేఆర్ ప్లేయర్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే.. పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు.

ప్రైజ్ ట్యాగ్: కామెరూన్ గ్రీన్ మరోసారి విఫలం..కేకేఆర్ రూ.25.20కోట్లు దండగేనా?
Cameron Green

ఇంటర్నెట్ డెస్క్: 2, 18, 4.. రూ.25.20కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ గత స్కోర్లు ఇవి. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా అతడెవరో! కామెరూన్ గ్రీన్. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా కోట్లు కుమ్మరించి అతడిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే.. పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు.


తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 18 పరుగులు, ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ బార్ట్‌లెట్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అయితే జట్టుకు అవసరం అయినప్పుడు కూడా ఆడలేకపోతే.. అంత ధర పెట్టి దండగ అంటూ గ్రీన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా గ్రీన్ ఇప్పటి వరకు బౌలింగ్ కూడా చేయని సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేకేఆర్ కెప్టెన్ రహానె కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ అనంతరం ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా.. క్రికెట్ ఆస్ట్రేలియాకే సమాధానం తెలియాలంటూ సమాధానమిచ్చాడు. దీంతో కేకేఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రైజ్ ట్యాగే ఇబ్బందా..?

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన గ్రీన్.. వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. రూ.25.20కోట్ల ప్లేయర్ ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి ప్రతి అభిమానిలో ఉండటం సహజం. భారీ అంచనాలతో బరిలోకి దిగుతుండటంతో ప్లేయర్‌పై ఒత్తిడి పెరిగి ఇలా పేలవ ప్రదర్శన కనబరుస్తారనే వాదన వినిపిస్తోంది. గత సీజన్‌లో స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అత్యధిక ధరకు తీసుకున్న విషయం తెలిసిందే. అతడు కూడా ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఫలితంగా కేకేఆర్ ఈ సీజన్ వేలానికి ముందు వెంకటేశ్ అయ్యర్‌ను రిలీజ్ చేసింది. ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడిని జయించి రానున్న మ్యాచుల్లో అయినా గ్రీన్ పుంజుకుంటాడో? లేదో? చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 06 , 2026 | 09:43 PM