శ్రేయస్ అయ్యర్ టీమిండియాకు కెప్టెన్ అవుతాడు: పంజాబ్ కింగ్స్ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 06 , 2026 | 06:50 PM
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ విజయకుమార్ వైశాఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. అనంతరం 2025లో రూ.26.75 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ అయ్యర్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లోనూ అద్భుతమైన కెప్టెన్సీతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాడు. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ జట్టులో అయ్యర్‌కు చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ విజయకుమార్ వైశాఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘శ్రేయస్ అయ్యర్ ఎప్పుడూ తన జట్టులోని ప్లేయర్లపై నమ్మకం ఉంచుతాడు. మరీ ముఖ్యంగా బౌలర్లను నమ్ముతాడు. ఫామ్ ఎలా ఉన్నా మద్దతుగా నిలుస్తాడు. ఒక బౌలర్‌కు అది చాలా ముఖ్యమైన విషయం. అయ్యర్ ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. త్వరలోనే భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని బలంగా నమ్ముతున్నాను’ అని వైశాఖ్ వెల్లడించాడు.
ఈ సీజన్‌లో విజయకుమార్ వైశాఖ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు సాధించి జట్టుకు కీలకంగా మారాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వైడ్ యార్కర్లు, స్లో బౌన్సర్లతో వికెట్లు సాధించాడు. నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు తన బౌలింగ్ మైండ్ సెట్‌పై వైశాఖ్ మాట్లాడాడు. ‘నా మీద నాకు నమ్మకం ఉంటే సరిపోతుంది. నేను ప్లాన్ చేసిన విధంగా బౌలింగ్ చేస్తే ఏ బ్యాటర్‌ని అయినా కట్టడి చేయగలను. ఒక బంతి బౌండరీకి వెళ్లినా, అది మంచి షాట్ అయితే అంగీకరించి మళ్లీ అదే ప్లాన్‌తో ముందుకు వెళ్తాను’ అని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!