Share News

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:38 PM

తన ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై టీమిండియా దిగ్గజం, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను తాజాగా అశ్విన్ పంచుకున్నాడు.

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి చవి చూసి తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో తన ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై టీమిండియా దిగ్గజం, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతేడాది అశ్విన్ అనూహ్యంగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను తాజాగా అశ్విన్ పంచుకున్నాడు.


‘ఐపీఎల్ 2025.. నా కెరీర్‌లో అత్యంత నిరాశాజనకమైన సీజన్ అది. నిజం చెప్పాలంటే నేను ఇంకా ఆడగలిగే స్థితిలోనే ఉన్నాను. కానీ మానసికంగా పూర్తిగా అలసిపోయాను. అలాంటి పరిస్థితుల్లో కొనసాగడం చాలా కష్టం అనిపించింది. గత ఐపీఎల్ సీజన్ గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంటుంది. అందుకే అక్కడ జరిగిన విషయాల గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. నా రిటైర్‌మెంట్ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం అయితే కాదు. ఇందులో జట్టు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నేను జట్టులో కొనసాగితే నన్ను రిటైన్ చేయాలా? రిలీజ్ చేయాలా? అన్న సందిగ్ధం మేనేజ్‌మెంట్‌కు ఉంటుంది. నేను తప్పుకుంటే వారికి ఆ సమస్య ఉండదు. అందులోనూ ఫ్రాంచైజీకి సుమారు రూ.10కోట్లు సేవ్ అవుతాయి’ అని అశ్విన్ వెల్లడించాడు.


అది పద్ధతి కాదు..

ప్రస్తుతం సీఎస్కే యువ ఆటగాళ్లతోనే ఆడుతోంది. ఈ విషయంపై కూడా అశ్విన్ మాట్లాడాడు. ‘యువ ప్లేయర్లకు సరైన శిక్షణ, ప్రాక్టీస్, పోటీ వాతావరణం కల్పించకుండా మంచి ఫలితాలు ఆశించడం పద్ధతి కాదు. బౌలర్లను వారి బలాలకు విరుద్ధంగా ఉపయోగిస్తే జట్టుకే నష్టం. జెమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు అలవాటే లేని యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం సరైన వ్యూహం కాదు. వారికున్న బలాలను కనుగొని.. తగ్గట్టుగా శిక్షణ ఇస్తే జట్టుకు విజయాలు దక్కే అవకాశాలు ఉంటాయి’ అని అశ్విన్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!

నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ

Updated Date - Apr 06 , 2026 | 05:16 PM