నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:28 PM
క్రికెట్‌లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్ బౌలర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మహ్మద్ షమీ..ఎల్ఎస్‌జీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి కీలకమై రెండు వికెట్లు సాధించాడు. దీంతో 'షమీ ఈజ్ బ్యాక్' అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
మ్యాచ్ అనంతరం షమీ(Mohammed Shami) మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్‌లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలమని పేర్కొన్నాడు. శారీరకంగా ఫిట్‌గా ఉండి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకే దేశవాళీల్లో మ్యాచ్‌లు ఆడుతున్నానని తెలిపాడు. తానేమి యంత్రాన్ని కాదని కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని తెలిపాడు. గత కొన్నేళ్లుగా బాగానే ఆడుతునప్పటికీ వాళ్లు పట్టించుకోవడం లేదని టీమిండియా సెలక్టర్ల తీరును పరోక్షంగా విమర్శించాడు.
ఎవరు గుర్తించకపోయినా తాను మాత్రం నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని వెల్లడించాడు. అభిషేక్, హెడ్ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకుంటారని, వారిపైనే ఫోకస్ పెట్టి విజయం సాధించామని అన్నాడు. టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో చక్కటి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నాడు.
కాగా 2025 మార్చి నుంచి షమీ భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్‌లో సత్తా చాటినా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో తనను తాను నిరూపించుకుని మరోసారి ఆటతోనే సెలక్టర్లకు సందేశం పంపాలని షమీ కసితో ఉన్నాడు. గత సీజన్ లో ఎస్ఆర్ హెచ్ తరఫున ఆడిన షమీ... ఈసారి లక్నో తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్ లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్ సాధించగా.. ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ 18 డాట్ బాల్స్ వేసిన షమీ ‘డాట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
స్టేడియంలో యువతి చేసిన రచ్చ.. ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్!
'పక్కకు తప్పుకో'.. సంజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎస్కే ఫ్యాన్స్