'పక్కకు తప్పుకో'.. సంజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎస్కే ఫ్యాన్స్
ABN , Publish Date - Apr 06 , 2026 | 10:23 AM
ఐపీఎల్ 2026లో టీమిండియా ఆటగాడు సంజు శాంసన్ విఫలమవుతోన్నాడు.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మూడు మ్యాచ్‌లలో సంజు శాంసన్ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కే ఫ్రాంఛైజీకి వచ్చినప్పటి నుంచి అతడు ముభావంగా కనిపిస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) హీరోగా నిలిచిన టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్... ఐపీఎల్‌లో జీరోగా మారుతున్నాడు. భారీ ఆశలతో ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ ఫ్రాంఛైజీ ఆశలను సంజూ అడియాశలు చేస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సంజు శాంసన్ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు సీఎస్కే జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాక అతడి ప్రదర్శనపై చెన్నై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు నుంచి పక్కకు తప్పుకో సంజు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మూడు మ్యాచ్‌లలో శాంసన్ 6, 7, 9 స్కోర్లు నమోదు చేసి, అభిమానులను నిరాశకు గురిచేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కావడానికి ముందే కూడా శాంసన్ ఫామ్ కోల్పోయాడు. అందుకే అతను పొట్టి ప్రపంచ కప్‌లో భారత జట్టు తరఫున ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. కానీ, సూపర్-8 లో దొరికిన అవకాశాన్ని ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఏకంగా టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలవడంలో సంజు కీలకపాత్ర పోషించాడు.
అలాంటి సంజు.. ఎల్లో డ్రెస్ వేసుకోగానే కనీస పోరాటం కూడా చేయడం లేదు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి అవసరమైన ఆరంభాన్ని అందించడంలో ఈ కేరళం కుర్రాడు విఫలమవడంతో, అతనికి ఆసక్తి లేకపోతే తప్పుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
'మీరు మానసికంగా సిద్ధంగా లేకపోతే, కొన్ని ఆటలకు తప్పుకోండి. ఇది కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు. మీ హావభావాలు కూడా మీకు ఆసక్తి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీరు నిరాశగా, జట్టుతో సంబంధం లేనట్లుగా కెమెరాల్లో కనిపిస్తున్నారు. అంగీకరించడానికి కష్టమే అయినా మీలో కసి, పట్టుదల, పోరాట పటిమ లోపించాయి' అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు ఓటములతో చెన్నై ప్రమాదంలో పడింది. సంజు శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా తన ఫామ్‌ను అందుకొని భారీ స్కోర్లు సాధిస్తే తప్ప, చెన్నై ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిలవడం కష్టమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్