శాండ్‌పేపర్ వివాదం: నన్ను బలిపశువును చేశారు.. బాన్‌క్రాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:20 PM
బాల్ ట్యాంపరింగ్ ఘటనలో నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఎనిమిదేళ్ల తర్వాత స్పందించి సంచలన విషయాలు బయటపెట్టాడు. బంతిపై శాండ్‌పేపర్ ఉపయోగిస్తున్నట్లు జట్టు మొత్తానికి తెలుసని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఎనిమిదేళ్ల తర్వాత దీనిపై స్పందించి సంచలన విషయాలు బయటపెట్టాడు. బంతిపై శాండ్‌పేపర్ ఉపయోగిస్తున్నట్లు జట్టు మొత్తానికి తెలుసని తెలిపాడు. కానీ కెమెరాకు చిక్కిన తనను మాత్రం బలిపశువుగా మార్చారని ఆరోపించాడు.
‘కోపం, మోసపోయానే బాధ, ఒంటరితనం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఒక్క ఘటన వల్ల నా క్రికెట్ కెరీర్ మొత్తం నాశనమైంది. 2019లో జస్టిన్ లాంగర్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచి దేశం తరఫున ఆడే అవకాశం రాలేదు. బాల్ ట్యాంపరింగ్ గురించి అందరికీ తెలిసింది సగమే. ఈ అసంపూర్తి నిజాన్ని కాపాడుతూ ఉండటం కంటే అసలు విషయాలు బయటపెట్టడమే మంచిదని భావించాను. శాండ్‌పేపర్ వివాదం తర్వాత జరిగిన విచారణలో నేను అన్ని విషయాలు నిజాయతీగా చెప్పలేకపోయాను. ఖవాజా వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భిన్నంగా స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ విషయం గురించి తనకేం తెలీదంటూ వ్యాఖ్యానించాడు. అవన్నీ అవాస్తవాలు. కమిన్స్ వ్యాఖ్యల తర్వాతే నేను ఇక మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని భావించాను’ అని బాన్‌క్రాఫ్ట్ వెల్లడించాడు.
శాండ్‌పేపర్ వ్యూహం వెనుక ఎవరున్నారు?
‘2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బంతిని రివర్స్ స్వింగ్ చేయించేందుకు డేవిడ్ వార్నర్ ప్రధానంగా వ్యవహరించేవాడు. అయితే ఈ చర్చల్లో అప్పటి హెడ్ కోచ్ డారెన్ లెమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ కూడా ఉన్నారు. స్టీవ్ స్మిత్ మాత్రం ఈ ప్రణాళికకు దూరంగా ఉండాలని భావించాడు. టీవీ కెమెరాలు వార్నర్‌ను నిరంతరం అనుసరిస్తుండటంతో ఆ బాధ్యతను నేనే తీసుకున్నా. ఆ పని చేయడం నాకు ఇష్టం లేకపోయినా.. టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్లా. శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతున్న విషయం కేవలం కోచింగ్ సిబ్బందికే కాదు.. కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లతో పాటు వికెట్ కీపర్ టిమ్ పైన్ నుంచి కూడా తెలుసు. బంతిపై నేను చేస్తున్న పని ఫలితాన్నిస్తోందా లేదా అని బౌలర్లంతా నాకు అభిప్రాయాలు చెప్పేవారు.
కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులోనూ శాండ్‌పేపర్ వినియోగం కొనసాగింది. బంతి రివర్స్ స్వింగ్‌కు సరిపోవడం లేదని సాకర్ తనతో చెప్పడంతో బౌలర్ల నుంచి మరోసారి అభిప్రాయాలు తీసుకున్నా. కెమెరాకు చిక్కిన తర్వాత రిజర్వ్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్కోంబ్ మైదానంలోకి వచ్చి తన వద్ద ఉన్న శాండ్‌పేపర్‌ను వెంటనే తీసేయాలని లెమన్ సూచించాడని చెప్పాడు. లెమన్‌కు ఈ విషయం తెలియకపోతే అలా చెప్పేవాడు కాదు. అప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసి ఉండాలి. మరోసారి చెబుతున్నా.. ఈ బాల్ ట్యాంపరింగ్ విషయం మాకందరికీ తెలుసు. చివరకు మొత్తం జట్టు చేసిన పనికి కెమెరాకు చిక్కిన నన్నే బలిపశువును చేశారు’ అని బాన్‌క్రాఫ్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన అర్ష్‌దీప్ సింగ్
సీఎస్కే ప్లేయర్ అవమానించినా.. ధోనీ భరించాడు: ఆకాశ్ చోప్రా