Share News

మద్యం మత్తులో ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:46 AM

న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించారు.

మద్యం మత్తులో ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?
Ben Stokes

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి తర్వాత క్లబ్‌కు వెళ్లిన ఈ ఇద్దరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) విచారణ చేపట్టింది. అయితే ఈ ఇద్దరి ప్లేయర్లపై బోర్డు నిషేధం విధించే అవకాశం లేకపోలేదు.


అసలేం జరిగిందంటే?

లండన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఇంగ్లండ్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, అట్కిన్సన్ అర్ధరాత్రి తర్వాత ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ సారాసెన్స్ అకాడమీకి చెందిన ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. అట్కిన్సన్‌పై ఆ ఆటగాడు చేయి చేసుకోగా.. అది పొరపాటున ఇంగ్లండ్ జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరికి తగిలినట్లు సమాచారం. గాయపడిన సెక్యూరిటీ గార్డుకు అత్యవసర చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘర్షణలో స్టోక్స్, అట్కిన్సన్ దాడికి పాల్పడలేదని ఈసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసుల జోక్యం అవసరం రాలేదని సమాచారం.


స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?

ఈ వ్యవహారాన్ని ఈసీబీ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. జూన్ 17 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టోక్స్ కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడిందన్న వార్తలు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, హ్యారీ బ్రూక్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనపై విమర్శలు రావడంతో ఈ ఏడాది జనవరిలోనే జట్టుకు అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనను బోర్డు అమలు చేసింది. అలాంటి పరిస్థితుల్లోనే స్టోక్స్, అట్కిన్సన్ నిబంధనలను ఉల్లంఘించడం వివాదానికి దారితీసింది.


ఇవి కూడా చదవండి:

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?

Updated Date - Jun 09 , 2026 | 12:11 PM