Share News

ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:05 PM

భారత క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలను సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ
BCCI

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలను సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరిని ఆదివారం ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సన్మానించనున్నారు.


నమన్ అవార్డ్స్‌లో ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఐదు భారత జట్లను కూడా ప్రత్యేకంగా గౌరవించనున్నారు.

  • భారత పురుషుల జట్టు: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025

  • భారత పురుషుల జట్టు: టీ20 ప్రపంచ కప్ 2026

  • భారత మహిళా జట్టు: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025

  • అండర్ 19 పురుషు జట్టు: అండర్ 19 ప్రపంచ కప్ 2025

  • అండర్ 19 మహిళల జట్టు: అండర్ 19 ప్రపంచ కప్ 2025


రోజర్ బిన్నీ సేవలు విశేషం

రోజర్ బిన్నీ.. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్, సెలెక్టర్‌గా కూడా సేవలందించాడు. 2000లో భారత అండర్-19 జట్టును ప్రపంచ కప్ విజేతగా తీర్చిదిద్దాడు. 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా పనిచేసి భారత క్రికెట్ అభివృద్ధికి కృషి చేశాడు.


ద్రవిడ్‌కు ప్రత్యేక గౌరవం

భారత క్రికెట్ చరిత్రలోనే రాహుల్ ద్రవిడ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. తన కెరీర్‌లో 24 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. పదేళ్లకు పైగా భారత బ్యాటింగ్‌లో ఎంతో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆయన్ని ‘ది వాల్’ అని కూడా అంటారు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతిగా యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు. 2018లో అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత జట్టును తీర్చిదిద్దాడు. తర్వాత భారత పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2024 టీ20 ప్రపంచకప్ విజయానికి మార్గనిర్దేశం చేశాడు.


మిథాలీ రాజ్ ప్రభావం

మహిళా క్రికెట్‌లో ఎనలేని సేవలు అందించింది మిథాలీ రాజ్. తన కెరీర్‌లో 20 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (7805) చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆమె నాయకత్వంలో భారత మహిళల జట్టు రెండుసార్లు ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరింది. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో మిథాలీ కీలక పాత్ర పోషించింది.


ఇతర అవార్డులు

2024-25 సీజన్‌కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ‘పాలీ ఉమ్రిగర్ అవార్డు’ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్-పురుషులు) అందుకోనున్నాడు. మహిళల విభాగంలో స్మృతి మంధాన ఐదోసారి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు అందుకోనుంది. దేశీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకూ బీసీసీఐ వివిధ అవార్డులు ప్రదానం చేయనుంది. అలాగే ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈసారి కూడా బీసీసీఐ దేశీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన అవార్డును అందుకోనుంది.


ఇవి కూడా చదవండి:

వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్

బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్

Updated Date - Mar 14 , 2026 | 03:05 PM