రూల్స్ ప్రకారం అది రనౌటే.. కానీ న్యాయం కాదు: సల్మాన్ అఘా
ABN , Publish Date - Mar 14 , 2026 | 02:35 PM
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ సీనియర్ బ్యాటర్ సల్మాన్ అఘా రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రనౌట్‌పై పలు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ సీనియర్ బ్యాటర్ సల్మాన్ అఘా రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీన్ని విమర్శిస్తుండగా.. మరికొంత మంది బంగ్లా ప్లేయర్లకు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ రనౌట్‌పై పలు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్ అలా రనౌట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
నాకు ఆ ఉద్దేశమే లేదు: సల్మాన్ అఘా
తాను రనౌట్ అయిన విధానంపై మ్యాచ్ అనంతరం సల్మాన్ అఘా స్పందించాడు. ‘నిబంధనల ప్రకారం అది ఔటే. నేనేం కాదనను. కానీ.. నేనే ఆ స్థానంలో ఎప్పటికీ అలా చేయను. క్రీడాస్ఫూర్తితో వ్యవహరిస్తాను. మేం గతంలోనూ ఇలాంటి పని చేయలేదు. భవిష్యత్తులోనూ చేయబోం. నిజానికి ఆ బాల్ నా ప్యాడ్, బ్యాట్‌ను తాకింది. దాంతో నన్ను రనౌట్ చేయరనుకున్నాను. దీంతో బంతిని బౌలర్‌కు అందిద్దామనుకున్నా. ఆ సమయంలో నాకసలు పరుగు తీసే ఉద్దేశమే లేదు. కానీ మిరాజ్ నన్ను రనౌట్ చేశాడు’ అని సల్మాన్ అఘా అన్నాడు.
ఇదేం ఛారిటీ మ్యాచ్ కాదు: లిటన్ దాస్
‘ఇక్కడికి ఎవరూ ఛారిటీ మ్యాచ్ ఆడటానికి రాలేదు. ఇదో అంతర్జాతీయ మ్యాచ్. రూల్స్ ప్రకారం సల్మాన్ అఘాది రనౌటే. ఈ ఔట్ మీద ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెబుతున్నారు. కానీ ఆటగాళ్లుగా మేం అది ఔటనే అనుకున్నాం’ అని బంగ్లా ప్రస్తుత వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ అన్నాడు.
క్రీడా స్ఫూర్తికి విరుద్ధం: రమీజ్ రజా
కామెంట్రీ సమయంలో రమీజ్ రజా ఈ రనౌట్‌పై మాట్లాడాడు. ‘రూల్స్ ప్రకారం అది రనౌటే. కానీ క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. అక్కడ బ్యాటర్ బంతిని బౌలర్‌కు అందించాలనుకున్నాడు. బ్యాటర్ తాను అలా రనౌట్ అవుతాననుకోలేదు’ అని రజా అన్నాడు.
ఇది అన్యాయం: మహ్మద్ కైఫ్
‘వికెట్లు తీయాలనే దృక్పథంతో అలా రనౌట్ చేయడం సబబు కాదు. ఓ కెప్టెన్ ఇలా చేయడం బాలేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ చేసినట్లు యువ క్రికెటర్లు ఎవరూ చేయొద్దు. అది న్యాయం కాదు’ అని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
ఇవి కూడ చదవండి:
వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్
బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్