Ban Vs Pak: వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:45 AM
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
స్పోర్ట్స్ డెస్క్: ఆట ఏదైనా సరే.. క్రీడా స్ఫూర్తి అనేది ముఖ్యం. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా ఘటనలు క్రికెట్‌లో అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా పాకిస్థాన్ , బంగ్లాదేశ్(Pak vs Ban) మధ్య జరిగిన రెండో వన్డేలో జరిగిన రనౌట్ చర్చనీయాంశంగా మారింది. ఆ రనౌట్ చేసిన బంగ్లా బౌలర్‌పై మాజీ ప్లేయర్లతో సహా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మినందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? అంటూ సదరు బౌలర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందంటే...
ఢాకా వేదికగా బంగ్లాదేశ్(Bangladesh), పాకిస్థాన్ మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మాజ్ సదాకత్(75), ఫర్హాన్(31) మంచి ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత పాక్ వెంటవెంటే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్లు సల్మాన్ అలీ అఘా(64), మహ్మద్ రిజ్వాన్(44) నిలకడగా ఆడి తమ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. ఈ క్రమంలోనే బంగ్లా బౌలర్ మోహిది హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్లలో సల్మాన్ అలీ అఘా ఊహించని విధంగా ఔటయ్యాడు.
ఆ ఓవర్‌లో మెహిది వేసిన నాలుగో బంతిని మహమ్మద్ రిజ్వాన్ స్ట్రెట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అఘా బ్యాట్‌కు తాకి ఆగింది. ఆ సమయంలోనే బౌలర్ మిరాజ్, సల్మాన్ పరస్పరం ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి బౌలర్‌కు అందించి.. సాయం చేసే ప్రయత్నం చేశాడు. కానీ అదే సమయంలో బంతిని అందుకున్న మిరాజ్ స్టంప్స్‌ను కొట్టేశాడు
వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పరిశీలించిన థర్డ్ అంపైర్.. సల్మాన్ అఘా(Salman Agha)ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో సల్మాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే తన గ్లౌవ్స్, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. కాసేపు బంగ్లా ప్లేయర్లతో వాగ్వాదానికి దిగిన సల్మాన్.. ఆ తర్వాత నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ రనౌట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
బాల్ లైవ్‌లో ఉన్నప్పుడు బ్యాటర్ దాన్ని బ్యాట్‌తో కానీ చేతితో కానీ టచ్ చేయకూడదు. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ కావాలని బంతిని తాకినా లేదా ఫీల్డర్‌ను అడ్డుకున్నా ‘అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్’ గా పరిగణిస్తారు. అయితే సాయం చేయబోతే.. ఇలా నమ్మించి మోసం చేయడమే అని కొందరు అంటే.. బంగ్లా బౌలర్ చేసింది తప్పేమి కాదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాత్రం మిరాజ్(Miraj) తీరును తప్పుబట్టాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే... ఇలాంటి పనిని ఏమాత్రం చేయకండి అంటూ యువ ఆటగాళ్లు కైఫ్ సలహా ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్