బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:01 AM
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాభవానికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. నిన్న ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్(Pakistan) ప్రతీకారం తీర్చుకుంది. తొలి వన్డేలో బంగ్లా చేతిలో పాక్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో రెండో వన్డేలో బంగ్లాకు పాక్ గట్టి సమాధానం ఇచ్చింది. నిన్న(శుక్రవారం) ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఆతిథ్య బంగ్లాను పాకిస్థాన్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను పాక్ జట్టు 1-1తో సమం చేసింది. మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్(Bangladesh) బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మాజ్ సదాకత్ (75) అర్ధ సెంచరీతో రాణించగా.. సల్మాన్ అఘా (64), మహమ్మద్ రిజ్వాన్ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం 275 పరుగుల లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వర్షం కూడా అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు మ్యాచ్ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించారు. వర్షం ఆగిన తర్వాత ఆట మొదలయ్యాక కూడా బంగ్లా వికెట్ల పతనం కొనసాగింది. విజయం కోసం లిటన్ దాస్ (41) కాసేపు పోరాడాడు. మరోవైపు అతనికి సహచర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దీంతో బంగ్లా జట్టు కేవలం 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బౌలర్లలో మాజ్ సదాకత్, హారిస్ రవూఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించాడు. మాజ్ సదాకత్(Maaz Sadaqat) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే మార్చి 15న ఇదే వేదికలో జరగనుంది.
ఇవి కూడా చదవండి: