మహిళల క్రికెట్‌కు యమా క్రేజ్
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:13 AM
దేశంలో మహిళల క్రికెట్‌కు క్రేజ్ అంతా ఇంతా లేదు. క్రికెట్ ఆడే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరగడమే అందుకు ఉదాహరణ. ఈమేరకు బీబీసీ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఆరేళ్లలో ఐదు శాతం పెరుగుదల
బీబీసీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల క్రికెట్‌కు క్రేజ్ అంతా ఇంతా లేదు. క్రికెట్ ఆడే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరగడమే అందుకు ఉదాహరణ. ఈమేరకు బీబీసీ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 10 వేల మంది మహిళలను సర్వే చేశారు. క్రికెట్ ఆడే మహిళల సంఖ్య 2020లో ఐదు శాతం ఉంటే ప్రస్తుతం అది 10 శాతానికి పెరగడం విశేషం. యువతులు క్రికెట్ ఆడేందుకు మరింత మక్కువ ప్రదర్శిస్తున్నారు. క్రికెట్ ఆడే 15 నుంచి 24 ఏళ్ల వయస్సుగల యువతులు 2020లో ఆరు శాతంగా ఉంటే..ప్రస్తుతం వారి సంఖ్య 16 శాతానికి హెచ్చింది. 15 నుంచి 24 ఏళ్ల వయస్సుగల మహిళలు ప్రతి నలుగురిలో ఒకరు క్రీడలను కెరీర్‌గా ఎంచుకుంటామని చెప్పడం..దేశంలో ఆటలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఉమెన్ ఇన్ బ్లూ గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌ను అందుకోగా..ఇటీవల ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌నూ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇంకా..మహిళల ప్రీమియర్ లీగ్‌కు లభిస్తున్న ఆదరణ.. వెరసి యువతులు క్రికెట్‌పట్ల అమితాసక్తి కనబరిచేందుకు దోహదం చేశాయని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్‌కు..
రెండు తెలుగు రాష్ర్టాల్లో యువతులు బ్యాడ్మింటన్ పట్ల మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీతోపాటు పంజాబ్‌లోనూ మహిళలు బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ సాధించిన ఘనతలు తెలుగు రాష్ట్రాల యువతులు బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న అధునాతన బ్యాడ్మింటన్ శిక్షణ సదుపాయాలు కూడా దీనికి మరో కారణం.