Share News

ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:15 AM

ప్రపంచ కప్‌ హాకీ క్వాలిఫయర్స్‌లో అదరగొడుతున్న భారత మహిళలు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో సలీమా టేటె సారథ్యంలోని....

ఫైనల్లో భారత్‌

  • సెమీస్‌లోఇటలీపై గెలుపు

  • ఇంగ్లండ్‌తో టైటిల్‌ఫైట్‌ నేడు

  • రాత్రి 7.30 నుంచి

హైదరాబాద్‌: ప్రపంచ కప్‌ హాకీ క్వాలిఫయర్స్‌లో అదరగొడుతున్న భారత మహిళలు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో సలీమా టేటె సారథ్యంలోని భారత్‌ ఏకైక గోల్‌తో ఇటలీని ఓడించింది. 40వ నిమిషంలో మనీషా చౌహాన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. శనివారం రాత్రి 7.30కు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. అంతకుమందు జరిగిన మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 2-0తో స్కాట్లాండ్‌ను ఓడించింది. బింగ్‌హామ్‌ లోటి (24వ ని.), డార్సీ బ్రౌన్‌ (28ని.) ఇంగ్లండ్‌కు గోల్స్‌ అందించారు.

నువ్వా..నేనా!

భారత్‌-ఇటలీ మ్యాచ్‌ తొలి క్వార్టర్‌ హోరాహోరీగా సాగింది. మిడ్‌ఫీల్డ్‌లో పట్టుకోసం ఇరుజట్లు నువ్వా..నేనా..అనేలా తలపడ్డాయి. రెండో క్వార్టర్‌లో మరింత దూకుడు పెంచిన భారత్‌..18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను రాబట్టింది. నవ్‌నీత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ను ఇటలీ గోల్‌కీపర్‌ లూసియా అడ్డుకుంది. 27వ నిమిషంలో ఆతిథ్య జట్టుకు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఈసారి కెప్టెన్‌ సలీమా సంధించిన షాట్‌ను ప్రత్యర్థి డిఫెండర్‌ నిలువరించింది. 29వ నిమిషంలో ఇంకో పెనాల్టీ కార్నర్‌ రాగా..నవ్‌నీత్‌ కౌర్‌ గోల్పోస్ట్లోకి కొట్టలేకపోయింది. ద్వితీయార్థంలో ఆరంభంలో ఎమీలీ ఫీల్డ్‌ గోల్‌ యత్నాన్ని భారత్‌ కీపర్‌ బిచూదేవి నిలువరించింది. ఇక..40వ నిమిషంలో మనోళ్లకు మరో పెనాల్టీ కార్నర్‌ దక్కగా ఈసారి మనీషా చౌహాన్‌ గురి తప్పకుండా గోల్పోస్ట్లోకి పంపి ఆధిక్యం అందించింది. చివరి క్వార్టర్‌లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఇటలీ డిఫెండర్లు గోల్‌ కాకుండా అడ్డుకున్నారు. 59వ నిమిషంలో ఇటలీకి పెనాల్టీ కార్నర్‌ ద్వారా స్కోరు సమం చేసే సువర్ణావకాశం దక్కింది.. అయితే ప్రత్యర్థికి భారత్‌ ఆ అవకాశం ఇవ్వలేదు.

Updated Date - Mar 14 , 2026 | 04:15 AM