Share News

కేకేఆర్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఐపీఎల్‌కు హర్షిత్ రాణా దూరం

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:40 PM

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌కు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి

కేకేఆర్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఐపీఎల్‌కు హర్షిత్ రాణా దూరం
Harshit Rana injury IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు(KKR) భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌కు దూరమయ్యాడని క్రీడా వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.


టీ20 ప్రపంచ కప్‌ 2026కు ముందు ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలికి గాయమైంది. దీంతో రాణా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 9న ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని సమాచారం. ఈ కారణంగా త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‍కు కూడా దూరం కానున్నాడని సమాచారం. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అతడి స్థానంలో ఇప్పటి వరకు ఎవర్నీ రిప్లేస్మెంట్‌గా తీసుకోలేదు.


'హర్షిత్ రాణా త్వరలో జరగనున్న ఐపీఎల్2026కు అందుబాటులో ఉండకపోవచ్చు. అతడి స్థానంలో జట్టులోని ఇతర బౌలర్లు వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాశ్ ఆడే అవకాశం ఉంది. హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు' అని కేకేఆర్ కు చెందిన ఓ అధికారి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది.

2024 ఐపీఎల్ సీజన్‪లో కోల్‌కతా టైటిల్ గెలుచుకోవడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 19 వికెట్లతో సాధించాడు. 2025 సీజన్‌కు ముందు అతడిని రూ.4 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది. ఆ సీజన్‌లో 13 మ్యాచులు ఆడి 15 వికెట్లు తీశాడు. మరోవైపు ఇదే ఫ్రాంచైజీ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అతడు కేకేఆర్ జట్టులో చేరనున్నాడు.


ఇవి కూడ చదవండి:

వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్

బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్

Updated Date - Mar 14 , 2026 | 01:52 PM