Share News

వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Sep 02 , 2026 | 07:41 AM

ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఓ ఆటగాడిని ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు.. 200 శాతం నమ్మకం వచ్చిన తర్వాతే స్క్వాడ్‌లోకి తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం!
BCCI

ఇంటర్నెట్ డెస్క్: ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ విషయంలో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఓ ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేసే ముందు అతడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు.. 200 శాతం నమ్మకం వచ్చిన తర్వాతే స్క్వాడ్‌లోకి తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిగా ఫిట్‌నెస్ సాధించని కొందరు ఆటగాళ్ల పేర్లు కూడా ఈ జాబితాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణాల ఫిట్‌నెస్‌పై బోర్డు ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్న విషయం స్పష్టమైంది.


ఇటీవలి కాలంలో బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (CoE) గాయపడిన ఆటగాళ్లను నిర్వహిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ.. మ్యాచ్‌ లేదా మైదానంలో కొద్దిసేపు కనిపించిన తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బీసీసీఐ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


21-28 రోజుల గ్యాప్‌.. అందుకే!

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కూడా ఆటగాళ్ల పేర్ల పక్కన ఆస్టరిస్క్‌ ఎందుకు పెడుతున్నారో వివరించారు. సాధారణంగా అంతర్జాతీయ సిరీస్‌కు 21 నుంచి 28 రోజుల ముందే జట్టును ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపిక చేసిన రోజున ఆటగాడు ఫిట్‌గా లేకపోయినా.. సిరీస్‌ ప్రారంభమయ్యే సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ‘జట్టును ప్రకటించిన రోజున ప్లేయర్ ఫిట్‌గా లేడని తప్పించాల్సిన అవసరం లేదు. ప్రయాణం చేసే సమయానికి లేదా మ్యాచ్‌ ఆడే సమయానికి అతడు పూర్తిగా ఫిట్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఫిట్‌నెస్‌కు లోబడి ఎంపిక చేస్తున్నామని స్పష్టంగా చెబుతున్నాం’ అని సైకియా వివరించారు.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!

Updated Date - Sep 02 , 2026 | 08:39 AM