నితీశ్, బుమ్రా వచ్చేశారు
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:01 AM
అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వెల్లడించిన 15 మంది సభ్యుల...
శాంసన్ కూడా..
హార్దిక్‌కు మళ్లీ గాయం
అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వెల్లడించిన 15 మంది సభ్యుల ఈ జాబితాలో స్టార్ పేసర్ బుమ్రాకు చోటు కల్పించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తను గాయపడిన విష యం తెలిసిందే. దీంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. అలాగే గాయంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌లకు దూరమై, సీఓఈ పునరావాస శిబిరంలో కోలుకున్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ కూడా పునరాగమనం చేశాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు. అఫ్ఘాన్ ఆతిథ్యమిచ్చే ఈ సిరీస్ స్థానిక అరుణ్ జైట్లీ మైదానంలో ఈనెల 13, 15, 17 తేదీల్లో జరుగనుంది. అయితే మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. తను మళ్లీ గాయపడడంతో సెలెక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అతడు భారత జట్టుకు ఆడలేదు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. మరోవైపు జింబాబ్వే సిరీస్‌కు దూరమైన శాంసన్, అక్షర్, సుందర్, బిష్ణోయ్, హర్షిత్ రాణా కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ మరో కీపర్‌గా ఉండనున్నాడు. ఆల్‌రౌండర్ కేటగిరీలో దూబే, నితీశ్, అక్షర్, వాషింగ్టన్ సుందర్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్, రవి బిష్ణోయ్ వ్యవహరిస్తారు.
ఫిట్‌నెస్ ఆధారంగా..
అఫ్ఘాన్‌తో సిరీస్‌కు బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలను ఎంపిక చేసినప్పటికీ.. వారు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ) ఇచ్చే నివేదిక ప్రకారం ఈ నలుగురు తుది జట్టులో ఉంటారా? లేదా? అనేది తేలనుంది. బుమ్రాను ఆసియాగేమ్స్‌లో ఆడిస్తారని భావించినా.. ఈ సిరీస్‌కే ఎంపిక చేయడం గమనార్హం. మరోవైపు జింబాబ్వే పర్యటించిన జట్టులో ఉన్న సూర్యాంశ్, రింకూ, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లపై వేటు పడింది.
భారత జట్టు
శేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!