Bangladesh cricketer: కేవలం మ్యాచులు ఆడటం మాత్రమే మా పని.. బంగ్లా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:18 PM
బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించినప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది. తాము కూడా టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి భారత్‌లో మ్యాచులు ఆడబోమని.. వేదికలు మార్చాలంటూ బంగ్లా క్రికెట్ బోర్డు.. ఐసీసీకి లేఖ రాసింది. దీనిపై రోజుకో అంశం తెర మీదకి వస్తుంది. ఒకవేళ మ్యాచులను తరలించడం వీలు కాకపోతే.. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ఈ వివాదాల గురించి మాకు అవసరం లేదు. ఈ విషయాలన్నీ టీమ్ మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. అధికారులు ఆ అంశం మీద నిర్ణయం తీసుకుంటారు. కేవలం మ్యాచులు ఆడటం మాత్రమే క్రికెటర్ల పని. ఒకవేళ ఆటగాళ్లను వేరే గ్రహం మీదకి పంపి అక్కడ ఆడి రమ్మన్నా.. వారు వెళ్లి అక్కడ ఆడాల్సిందే. ఈ విషయంలో ఇతర ఆటగాళ్లకు సందేహాలు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు’ అని హసన్ అన్నాడు.
ఇవన్నీ సానుకూలాంశాలు కావు..
గత టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించిన ఆటగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో ప్రస్తుత పరిణామాలపై స్పందించాడు. ‘మీరు గమనిస్తే.. ప్రతి ప్రపంచ కప్‌నకు ముందు మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కొన్ని ప్రపంచ కప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను. ఇలాంటి అంశాలు క్రికెటర్ల ఆటతీరుపై ప్రభావం చూపుతాయి. ఆటగాళ్లు ఈ విషయాలను పక్కన పెట్టి జట్టు కోసం ఎలా ప్రదర్శన ఇవ్వాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనా ఈ సమస్యలు లేకుంటే మంచిది. అయితే ఇది ఆటగాళ్ల చేతిలో లేని అంశం’ అని శాంటో వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
జెమీమాతో కలిసి పాడి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గావస్కర్!
అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!