Share News

Sunil Gavaskar: జెమీమాతో కలిసి పాడి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గావస్కర్!

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:38 PM

జెమీమా ఒప్పుకుంటే తనతో కలిసి పాట పాడుతానంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జెమీకి గిటార్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఆమెతో కలిసి పాట పాడారు.

Sunil Gavaskar: జెమీమాతో కలిసి పాడి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గావస్కర్!
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. క్రికెట్ మాత్రమే కాదు చక్కగా గిటార్ ప్లే చేస్తూ పాటలు కూడా పాడుతుంటుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్-2025 సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను అద్భుతమైన సెంచరీతో చిత్తు చేసి జట్టుకు విజయాన్ని అందించింది జెమీమా. ఆ మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్వయంగా స్పందించి.. జెమీమా ఒప్పుకుంటే తనతో కలిసి పాట పాడుతానంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దానికి జెమీ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తాజాగా సునీల్ గావస్కర్.. జెమీమా రోడ్రిగ్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆమెతో కలిసి పాట పాడారు. ఈ మధుర ఘట్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


క్రికెట్ బ్యాట్ ఆకారంలో గిటార్..

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రమే కాదు.. జెమీ(Jemimah Rodrigues)కి సన్నీ ఓ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. క్రికెట్ బ్యాట్ ఆకారంలో ప్రత్యేకంగా తయారు చేసిన గిటార్‌ను ఆమెకు బహూకరించాడు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది గావస్కర్-జెమీమా సంగీత ద్వయం. బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’ చిత్రంలోని ‘ఏ దోస్తీ..’ పాటను ఇద్దరూ కలిసి ఆలపించారు. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘సునీల్ సర్ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు చూసిన అత్యంత కూల్ ‘బ్యాటర్’తో నేను పాట పాడా. ఇది నిజంగా నాకు మరిచిపోలేని జ్ఞాపకం’ అంటూ జెమీమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.


ఇక క్రికెట్ విషయానికొస్తే, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు జెమీమా నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. అటు క్రికెట్‌లోనూ, సంగీతంలోనూ తనదైన ముద్ర వేస్తున్న జెమీమా.. అభిమానుల మనసుల్లో మరోసారి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


ఇవి కూడా చదవండి:

తిలక్ వర్మ స్థానంలో అతడే సరైన ఎంపిక: ఆకాశ్ చోప్రా

మలేసియా ఓపెన్.. టోర్నీ నుంచి సింధు ఔట్

Updated Date - Jan 10 , 2026 | 07:59 PM