Jemimah Rodrigues: మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయా: జెమీమా
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:27 AM
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్.. బాల్యంలో తనకు జరిగిన ఓ భయానక అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఆట ఆడుతూ మొదటి అంతస్తు నుంచి పడిపోయానని.. తన బంధువులు చనిపోయిందని అనుకున్నారని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల క్రికెట్ అంటేనే ఆసక్తి చూపని అభిమానులు.. ఇప్పుడు ప్రతి మహిళా క్రికెటర్ పేరు గుర్తు పెట్టుకునే విధంగా మారింది. ముఖ్య కారణం.. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ని టీమిండియా గెలుచుకోవడమే! సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి అద్భుతమైన శతకంతో అజేయంగా నిలిచి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్. ఆ నాక్ తర్వాత తన భవితవ్యమే కాదు.. భారత మహిళల భవిష్యత్తు కూడా మారింది. ఆ సూపర్ ప్రదర్శన తర్వాత తాజాగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ 2026లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ అయింది. అయితే బాల్యంలో తనకు జరిగిన భయానక అనుభవాన్ని జెమీమా(Jemimah Rodrigues) తాజాగా అభిమానులతో పంచుకుంది. చిన్న వయసులోనే ఆమె ఓ ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నట్టు తెలిపింది.
‘నాకు అప్పుడు ఎనిమిదేళ్లు ఉంటాయి. చర్చ్ ప్రోగ్రాం సమయంలో పిల్లలమంతా బయట ఆడుకుంటున్నాం. ఆటలో భాగంగానే నా కజిన్ రాచెల్ విసిరిన క్రాక్స్ చెప్పు ఒక చెక్కపైన పడిపోయింది. దాన్ని తీసుకురావాలని నేను హీరోలా ముందుకొచ్చా. అక్కడ ఉన్న ఒక బాక్స్‌పై కాలు పెట్టాను. ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాను. నేరుగా మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయా. అయితే అదృష్టవశాత్తు నాకు పెద్దగా గాయాలు కాలేదు. కింద ఒక మహిళ భోజనం చేస్తూ కూర్చుంది. నేను ఆమె తలపై పడిపోయాను. నేను కింద పడిపోయిన తర్వాత స్పృహ కోల్పోవడంతో నా బంధువులు నేను చనిపోయానని భావించారు’ అని నాటి క్షణాలను జెమీమా గుర్తు చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
తిలక్ వర్మ స్థానంలో అతడే సరైన ఎంపిక: ఆకాశ్ చోప్రా
మలేసియా ఓపెన్.. టోర్నీ నుంచి సింధు ఔట్