జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన భారత షట్లర్
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:03 PM
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహరాతో తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూ(చైనా)పై సింధు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సింధు.. కేవలం 35 నిమిషాల్లోనే 21-16, 21-14 స్కోరుతో వరుస గేమ్‌ల్లో గెలిచి ప్రత్యర్థిపై సత్తాచాటింది. తొలి గేమ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ, మళ్లీ లయ అందుకుంది. ఆ తర్వాత వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం చెలాయించింది. ఇక.. రెండో గేమ్‌లో అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెచ్చిపోయిన భారత స్టార్ షట్లర్ 8-0 ఆధిక్యంతో మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని అలవోక విజయం సాధించింది. ఈ విజయంతో హాన్ యూపై సింధు తన హెడ్ టూ హెడ్ రికార్డును 8-1కు మెరుగుపరుచుకుంది. ఈ సీజన్‌లో సింధు నమోదు చేసిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటిగా నిలిచింది.
ఇక.. క్వార్టర్ ఫైనల్లో సింధు జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహరాతో తలపడనుంది. టాప్ క్రీడాకారిణి ఆన్ సె-యంగ్(దక్షిణ కొరియా) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో ఒకుహరాకు వాకోవర్ లభించింది. ప్రస్తుతం.. టోర్నీలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ సింధు కావడంతో అభిమానుల ఆశలన్నీ ఆమెపైనే ఉన్నాయి.
ఇవీ చదవండి:
వారిని నేల మీదకు దించాలి.. గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఉద్రిక్తతలు.. అర్జెంటీనాపై ఫిఫా చర్యలు తీసుకుంటుందా..