ఆస్ట్రేలియాకు మరో షాక్.. 44వేల డాలర్ల ఫైన్‌తో పాటు పాయింట్ల కోత!
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:16 PM
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాను ఇప్పుడు ఓవర్ రేట్ ఉచ్చు వెంటాడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన ఆసీస్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు ఓవర్ రేట్ ఉచ్చు వెంటాడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన ఆసీస్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఆ జట్టుపై భారీ జరిమానాతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల కోత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో రోజు టీ విరామానికి ముందే ఓటమి పాలైంది. మూడో రోజు ఆ జట్టు 90 ఓవర్లు వేయాల్సి ఉండగా.. కేవలం 86 ఓవర్లే పూర్తి చేసింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడినట్లయింది. అయితే మ్యాచ్ రిఫరీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఒక్కో ఓవర్‌కు 5 శాతం జరిమానా
ఐసీసీ నిబంధనల ప్రకారం సాధారణంగా ఒక రోజులో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే.. ఒక్కో ఓవర్ తక్కువగా వేసినందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఒక్కో టెస్టుకు సుమారు 20 వేల డాలర్లు మ్యాచ్ ఫీజుగా లభిస్తుందని సమాచారం. నాలుగు ఓవర్ల లోటుకు ఒక్కో ఆటగాడిపై 4 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. తుది జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లపై కలిపి 44 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల కోత?
ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘనకు కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా.. పరిస్థితులను బట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లను కూడా ఐసీసీ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 84 పాయింట్లతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో స్లో ఓవర్‌కు ఒక పాయింట్ కోత పడుతుంది. ఈ లెక్కన నాలుగు ఓవర్లకు నాలుగు పాయింట్ల వరకు కోత పడుతుందని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇతర జట్ల తాజా పాయింట్ల శాతాన్ని బట్టి పట్టికలో ఆస్ట్రేలియా స్థానం మారే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?
శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?