భారత్-పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ ఎవరికంటే?
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:02 PM
ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో మ్యాచ్ రద్దయితే స్వర్ణ పతకం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. పురుషుల క్రికెట్ విభాగంలో స్వర్ణ పతకం కోసం శనివారం దాయాది దేశాలు తలపడనున్నాయి. అయితే మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఆటకు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్-పాక్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. వాతావరణ పరిస్థితుల అంచనా ప్రకారం ఉదయం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండగా.. మధ్యాహ్నానికి అది తగ్గే అవకాశముంది. ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని అంచనా. మ్యాచ్ జరగాల్సిన సమయంలో వర్షం పూర్తిగా తగ్గకపోతే ఇరు జట్లకు ఇబ్బందులు తప్పవు. దీంతో మ్యాచ్ రద్దయితే స్వర్ణ పతకం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.
మ్యాచ్ రద్దయితే..
2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ పురుషుల క్రికెట్ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. అప్పట్లో మెరుగైన టీ20 ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. అయితే 2026 ఆసియా క్రీడల్లో అలాంటి నిబంధన లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్-పాకిస్థాన్ ఫైనల్ ఎలాంటి ఫలితం లేకుండా పూర్తిగా రద్దయితే.. స్వర్ణ పతకాన్ని ఇరు జట్లు పంచుకోనున్నాయి. అంటే భారత్, పాకిస్థాన్ రెండింటినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఆసియా క్రీడల్లో తొలిసారిగా..
ఆసియా క్రీడల క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ పురుషుల జట్లు ఇప్పటివరకు తలపడలేదు. 2023 హాంగ్‌జౌ క్రీడల తర్వాత భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పాక్‌తో మ్యాచ్ పడలేదు. ఇప్పుడు తొలిసారి ఆసియా క్రీడల వేదికపై దాయాది దేశాలు స్వర్ణం కోసం పోటీ పడుతున్నాయి. 2023లో గెలిచిన స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలని భారత్ భావిస్తుండగా.. పాకిస్థాన్ తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్‌లో పసిడి సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: బాక్సింగ్‌లో లవ్లీనా సంచలనం.. భారత్‌కు మరో పసిడి
వన్డే ప్రపంచ కప్: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. పార్థివ్ పటేల్ సెటైర్లు