రోహిత్ భాయ్ ఇంటికెళ్లి కెప్టెన్సీపై సలహాలు తీసుకున్నా: ఆయుశ్ మాత్రే
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:10 AM
భారత అండర్-19 జట్టు ప్రపంచకప్-2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై యువ కెప్టెన్ ఆయుశ్ మాత్రే తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను కెప్టెన్‌గా రాణించడంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత అండర్-19 జట్టు ప్రపంచకప్-2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో యువ కెప్టెన్ ఆయుశ్ మాత్రే పేరు కూడా మార్మోగింది. అయితే తాను కెప్టెన్‌గా రాణించడంలో టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మాత్రే తాజాగా వెల్లడించాడు.
‘ఐపీఎల్ తర్వాత నన్ను అండర్-19 కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో కెప్టెన్సీ గురించి నాకు పెద్దగా తెలియదు. అందుకే రోహిత్ భాయ్‌కు మెసేజ్ చేశాను. ఐపీఎల్ సమయంలో ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్, మెసేజ్ చేయొచ్చని ఆయన అప్పటికే చెప్పారు. దీంతో ఆయనకు కాల్ చేసి కలిసి మాట్లాడాలని ఉందని చెప్పాను. దాంతో తన ఇంటికి రమ్మన్నారు. అక్కడ చాలా సేపు ఆయనతో మాట్లాడాను. కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపించాలి? ఆటగాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలి? వంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. ఎంతో సమయం కేటాయించి మాట్లాడారు. మా నాన్నతో కూడా దాదాపు అరగంట మాట్లాడారు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఎప్పుడూ మాట్లాడేందుకు అందుబాటులో ఉంటారు’ అని మాత్రే వెల్లడించాడు.
ధోనీని చూసి భయపడ్డా..
చెన్నై సూపర్ కింగ్స్‌లో తన అనుభవాల గురించి కూడా ఆయుష్ మాత్రే ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తొలిసారి ప్రత్యక్షంగా చూసినప్పుడు భయపడ్డానని చెప్పాడు. ‘మాహీ భాయ్‌ను తొలిసారి ప్రత్యక్షంగా చూసినప్పుడు నిజంగా భయపడ్డాను. ఇప్పటికీ కొంచెం ఆ భావన ఉంటుంది. ఆయన అందరితో చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు. కానీ ఆయన ఒక లెజెండ్. ఆయనతో ఫొటో దిగాలని అనుకున్నా.. ఎలా వెళ్లి మాట్లాడాలో అర్థం కాలేదు. ట్రయల్స్‌లో చివరి రోజు ధైర్యం చేసి వెళ్లాను. ఆయనతో ఫొటో దిగాను. అయితే పెద్దగా మాట్లాడలేదు. కేవలం ఫొటో మాత్రమే తీసుకున్నా’ అని ఆయుశ్ మాత్రే వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: బాక్సింగ్‌లో లవ్లీనా సంచలనం.. భారత్‌కు మరో పసిడి
వన్డే ప్రపంచ కప్: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. పార్థివ్ పటేల్ సెటైర్లు