ఆసియా క్రీడలు.. అవి ఫైవ్‌స్టార్ కాకపోయినా మంచి హోటళ్లే: బీసీసీఐ
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:06 AM
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెటర్ల వసతులపై నెలకొన్న వివాదానికి బీసీసీఐ తెరదించింది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెటర్ల వసతులపై నెలకొన్న వివాదానికి బీసీసీఐ తెరదించింది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నగోయాలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన వసతుల్లోనే టీమిండియా ప్లేయర్లు బస చేస్తారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. అవి సాధారణంగా విదేశీ పర్యటనల్లో క్రికెటర్లకు లభించే ఫైవ్‌స్టార్ హోటళ్లు కాకపోయినా సౌకర్యవంతమైనవే అని తెలిపాడు.
‘నగోయాలో పెద్ద హోటళ్లు అందుబాటులో లేవు. అందుకే ఈ సమస్య తలెత్తింది. ఆటగాళ్లకు కేటాయించిన హోటళ్ల ఫొటోలు, వీడియోలను ఇప్పటికే పరిశీలించాం. వసతుల విషయంలో బీసీసీఐ, భారత ప్లేయర్లు సంతృప్తిగా ఉన్నారు. నగోయాలో బస చేయలేము అనుకునే ప్లేయర్లు టోక్యో లేదా ఒసాకాలో ఉండాలి. కానీ అవి చాలా దూరం. అందుకే నగోయాలోనే వసతులు కల్పించాలని నిర్ణయించాం. ఆటగాళ్లకు ట్విన్ షేరింగ్ గదులు కాకుండా ప్రత్యేక గదులు కేటాయిస్తాం. వసతుల కంటే మైదానం, పిచ్, డ్రెస్సింగ్ రూమ్‌ల విషయంలోనే తొలుత ఆందోళన ఉండేది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బృందం నగోయాను సందర్శించి మైదానం, పిచ్, డ్రెస్సింగ్ రూమ్‌లను పరిశీలించిందని.. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది’ అని రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
మరోవైపు ఆసియా క్రీడల కోసం భారత్ పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోందని శుక్లా స్పష్టం చేశాడు. ‘బీ టీమ్’ను పంపుతున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన భారత బృందం ఈసారి కూడా సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత జట్టు సెప్టెంబర్ 20న టోక్యో బయలుదేరనుంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న తన తొలి మ్యాచ్ ఆడుతుంది. గత ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్-భారత్ టీ20 సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టీవీ ప్రసార హక్కులు
పీసీబీ నాకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాలి: పాక్ మాజీ కోచ్ గెలెస్పీ