Share News

‘సౌత్‌’కిక కష్టమే!

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:06 AM

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ జట్టు టైటిల్‌ అందుకోవడం లాంఛనమే కానుంది. తొలి రెండు రోజులు బ్యాటర్లు అదరగొట్టగా....

‘సౌత్‌’కిక కష్టమే!

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

ఫాలోఆన్‌ ప్రమాదంలో సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ 242/6

దేవ్‌దత్‌, తిలక్‌ హాఫ్‌ సెంచరీలు

చెన్నై: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ జట్టు టైటిల్‌ అందుకోవడం లాంఛనమే కానుంది. తొలి రెండు రోజులు బ్యాటర్లు అదరగొట్టగా.. తామేమీ తక్కువ కాదంటూ ఆ జట్టు బౌలర్లు సైతం చెలరేగారు. దీంతో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌత్‌జోన్‌ తడబడింది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (62), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (56 బ్యాటింగ్‌) మాత్రమే రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్‌ 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (32), షేక్‌ రషీద్‌ (27), శ్రేయాస్‌ గోపాల్‌ (26) ఓ మాదిరిగా ఆడారు. క్రీజులో తిలక్‌తో పాటు మిలింద్‌ (2 బ్యాటింగ్‌) ఉన్నాడు. పేసర్‌ షమి, ముకేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్రస్తుతం సౌత్‌ జోన్‌ 466 పరుగులు వెనుకంజలో ఉంది. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫాలోఆన్‌ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే సౌత్‌ మరో 266 పరుగులు చేయాల్సివుంది. ఒక వేళ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్‌ జోన్‌ విజేతగా నిలుస్తుంది.

వణికించిన షమి: సౌత్‌ జోన్‌ బ్యాటర్లను కుదురుకోనీయకుండా పేసర్లు షమి (11-4-17-2), ముకేశ్‌ (12-1-36-2) పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వెటరన్‌ షమి చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు ప్రత్యర్థి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తను వేసింది 11 ఓవర్లే అయినా నాలుగు మెయిడిన్లతో 17 పరుగులే ఇచ్చి రషీద్‌, స్మరణ్‌ (23)ల వికెట్లు తీశాడు. ఆరో ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయిన జట్టును దేవ్‌దత్‌ ఆదుకున్నాడు. మరో ఓపెనర్‌ జగదీశన్‌తో కలిసి రెండో వికెట్‌కు 60 పరుగులు, రషీద్‌తో మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. దేవ్‌దత్‌ను ముకేశ్‌ అవుట్‌ చేశాక తిలక్‌ బాధ్యతను తీసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో వికెట్ల పతనం వేగంగా సాగింది. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ నుంచి సహకారం అందడంతో ఆరో వికెట్‌కు తిలక్‌ 66 పరుగులు జత చేశాడు.


సంక్షిప్త స్కోర్లు:

ఈస్ట్‌ జోన్‌: 708 ఆలౌట్‌

సౌత్‌ జోన్‌: 80 ఓవర్లలో 242/6 (దేవ్‌దత్‌ 62, తిలక్‌ 56 బ్యాటింగ్‌, జగదీశన్‌ 32; షమి 2/17, ముకేశ్‌ 2/36).

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 05:06 AM