Share News

15 ఏళ్లకే రివ్యూల్లో అదుర్స్.. డీఆర్ఎస్ స్పెషలిస్ట్‌గా వైభవ్ సూర్యవంశీ!

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:35 PM

వయసు 15 ఏళ్లే.. కానీ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం తడబడటం లేదు. ముఖ్యంగా డీఆర్‌ఎస్‌ విషయంలో తనదైన ముద్ర వేస్తున్నాడు భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.

15 ఏళ్లకే రివ్యూల్లో అదుర్స్.. డీఆర్ఎస్ స్పెషలిస్ట్‌గా వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: వయసు 15 ఏళ్లే.. కానీ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం తడబడటం లేదు. ముఖ్యంగా డీఆర్‌ఎస్‌ విషయంలో తనదైన ముద్ర వేస్తున్నాడు భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. దులీప్‌ ట్రోఫీలో ఇప్పటికే మూడు విజయవంతమైన రివ్యూల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ డీఆర్ఎస్ స్పెషలిస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


సౌత్‌ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ముందు సౌత్‌ జోన్‌ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్‌ వికెట్‌ విషయంలో వైభవ్‌ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన ఆరో ఓవర్‌లో బంతి భుయ్‌ బ్యాట్‌ అంచును తాకినట్లు వికెట్‌ కీపర్‌ కుమార్‌ కుషాగ్రా, వైభవ్‌కు అనిపించింది. అంపైర్‌ మాత్రం ఔట్‌ ఇవ్వలేదు. దీంతో వైభవ్‌ పదే పదే ఇషాన్‌ కిషన్‌ను రివ్యూ తీసుకోవాలని కోరాడు. స్టంప్‌ మైక్‌లో యువ ఆటగాడి మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి. ‘రివ్యూ లేలో భాయ్(రివ్యూ తీసుకో)’ అంటూ కిషన్‌ను రివ్యూకు వెళ్లేలా చేశాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్‌ కనిపించడంతో బంతి బ్యాట్‌ను తాకినట్లు నిర్ధారణ అయింది. దీంతో భుయ్‌ పెవిలియన్‌ చేరాడు.


ఇషాన్‌ కిషన్ ‌మైదానం వీడటంతో ఈస్ట్‌ జోన్‌కు వైభవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. షమి బౌలింగ్‌లోనూ వైభవ్ డీఆర్‌ఎస్‌ నైపుణ్యాన్ని చూపించాడు. షమి వేసిన బంతి స్మరన్ బ్యాట్ అంచున తగిలింది. వికెట్ కీపర్ కుషాగ్రా క్యాచ్‌ కోసం అప్పీల్‌ చేశాడు. వికెట్‌ కీపర్‌కు బంతి బ్యాట్‌ను తాకిందన్న నమ్మకం ఉండటంతో వైభవ్‌ కూడా రివ్యూకు అంగీకరించాడు. ఈసారి కూడా అల్ట్రాఎడ్జ్‌ వైభవ్‌కు అనుకూలంగా వచ్చింది. స్పష్టమైన స్పైక్‌ కనిపించడంతో స్మరన్ రవిచంద్రన్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు.


సెమీ ఫైనల్లోనూ ఇదే జోరు

సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్‌తో మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడటంతో వైభవ్ కెప్టెన్సీ చేశాడు. అక్కడ కూడా డీఆర్‌ఎస్‌లో వైభవ్‌ తన ప్రతిభ చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఆర్యన్‌ జుయాల్‌ క్యాచ్‌ విషయంలో తీసుకున్న రివ్యూ కూడా విజయవంతమైంది. సెమీఫైనల్‌, ఫైనల్‌ కలిపి వైభవ్‌ సూచించిన మూడు డీఆర్‌ఎస్‌ రివ్యూలు విజయవంతం అవ్వడం విశేషం.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్-భారత్ టీ20 సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టీవీ ప్రసార హక్కులు

పీసీబీ నాకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాలి: పాక్ మాజీ కోచ్ గెలెస్పీ

Updated Date - Sep 08 , 2026 | 03:51 PM