Share News

అండర్ 19 ఆసియా కప్‌: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం.. యూఏఈపై 160 పరుగులతో..

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:28 PM

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడైన ఆర్యవీర్.. అండర్-19 ఆసియా కప్ 2026లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మంగళవారం యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు.

అండర్ 19 ఆసియా కప్‌: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం.. యూఏఈపై 160 పరుగులతో..
Aryaveer Sehwag

ఇంటర్నెట్ డెస్క్: బ్యాట్ పట్టాడంటే బౌలర్లకు చుక్కలు చూపించడంలో తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు యువ క్రికెటర్ ఆర్యవీర్ సెహ్వాగ్. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడైన ఆర్యవీర్.. అండర్-19 ఆసియా కప్ 2026లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మంగళవారం యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు.


ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆర్యవీర్ కాస్త నెమ్మదిగా ఆడాడు. క్రీజులో కుదురుకునేందుకు 14 బంతులు తీసుకుని తొలి పరుగు సాధించాడు. అయితే ఒక్కసారి లయ అందుకున్నాక అతడిని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతూ యూఏఈ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 160 పరుగులు సాధించి చివరకు పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


ఇదిలా ఉండగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈకి 310 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్యవీర్(160) భారీ సెంచరీ, వీకే వినీత్(67) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్(17), అర్జున్ రాజ్‌పుత్(4), యశ్‌బర్దన్ చౌహాన్(17), అన్వయ్ ద్రవిడ్(12), మనాల్ చౌహాన్(1) పరుగులు చేశారు. మోహిత్(7*), ఆర్యన్(2*) నాటౌట్‌గా నిలిచారు. యూఏఈ బౌలర్లలో నసీం ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. హదాయాతుల్లా, నూరుల్లా, అయాన్ మిస్బా తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి...

భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఏలూరులో పెద్దపులి కలకలం.. ఆవు, రెండు దూడలను చంపేసిన పులి

Updated Date - Nov 10 , 2026 | 02:35 PM