Share News

లలిత్ మోదీకి కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా మద్దతు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:12 PM

ఐపీఎల్‌ను జనవరిలో నిర్వహించాలన్న మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ప్రతిపాదనకు కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా మద్దతు తెలిపారు. వేసవి వేడి నుంచి ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఉపశమనం కలిగేలా క్యాలెండర్ మార్చాలని సూచించారు.

లలిత్ మోదీకి కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా మద్దతు!
Juhi Chawla

స్పోర్ట్స్ డెస్క్‌: ప్రపంచంలోనే క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్‌ పేరొందిన ఐపీఎల్ కు భారీగా అభిమానులు ఉన్నారు. దాదాపు రెండున్నర నెలలపాటు సాగే ఈ మెగా లీగ్‌ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ యువ ఆటగాళ్లకు ఐపీఎల్ అనేది మంచి వేదికగా మారింది. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లలు గుర్తింపు సంపాదించి.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికయ్యారు. అలాంటి ప్రత్యేకమైన ఈ ఐపీఎల్ క్యాలెండర్ లో మార్పులు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మాట్లాడుతూ... మార్చి - మే మధ్య జరిగే ఈ టోర్నీని ఇంకాస్త ముందుకు జరిపితే బాగుంటుందనే ఆలోచనను వెల్లడించారు. వేసవికాలం కావడంతో వేడి, ఉక్కపోతను తట్టుకోవడం కష్టమని అన్నారు. అదే జనవరిలో పెడితే అన్ని విధాలుగా బాగుంటుందని లలిత్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన వ్యాఖ్యలకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని, సినీ నటి జూహీ చావ్లా మద్దతుగా నిలిచారు. ఐపీఎల్ క్యాలెండర్‌ను ముందుకు తీసుకురావాలని సూచించారు.


'క్రికెట్ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు ఇకపై తన స్థానాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రభావితం చేసే హక్కును ఐపీఎల్ సంపాదించుకుంది. అలాంటప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ను అత్యంత తీవ్రమైన వేడిలో ఎందుకు నిర్వహించాలి? ఒకవేళ క్యాలెండర్‌ను పునఃసమీక్షిస్తున్నట్లయితే.. ఏప్రిల్-మే నెలలకు బదులుగా జనవరిని ఎందుకు ఎంచుకోకూడదు?. మెరుగైన పరిస్థితులు, మెరుగైన క్రికెట్. మొత్తంగా అందరికీ ఒక మంచి అనుభవం. ప్రస్తుతం ఐపీఎల్ పరిణామం చెందింది. కాబట్టి ఇప్పుడు దాని క్యాలెండర్ కూడా మారాలి!' అని చావ్లా ఎక్స్‌లో రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఏలూరులో పెద్దపులి కలకలం.. ఆవు, రెండు దూడలను చంపేసిన పులి

అఫ్గానిస్థాన్ జట్టుకు షాకిచ్చిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు..

Updated Date - Nov 10 , 2026 | 01:12 PM