Share News

అక్షర్‌ ట్రేడ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అశ్విన్‌ కీలక సూచనలు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 08:44 AM

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విండో ప్రక్రియ ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. అక్షర్‌ను వదులుకుంటే ఢిల్లీ స్పిన్ విభాగం బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు.

అక్షర్‌ ట్రేడ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అశ్విన్‌ కీలక సూచనలు!
Axar Patel Trade

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విండో ప్రక్రియ ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఫ్రాంచైజీకి సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఢిల్లీ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గూటికి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్రేడ్ డీల్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఢిల్లీ ఈ సాహసం ఎందుకు చేస్తోంది? దీనివల్ల ఆ జట్టుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి? అనే అంశాలపై అశ్విన్ విశ్లేషించారు.


అశ్విన్ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో అక్షర్ పటేల్‌ను వదులుకోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బే కానుంది. ఐపీఎల్‌లో నలుగురు నాణ్యమైన ఓవర్లు వేయగల లెస్ట్ ఆర్మ్ స్పిన్నర్, మిడిలార్డర్లో జట్టును ఆదుకోగల నాణ్యమైన టీమిండియా ఆల్ రౌండర్లు చాలా అరుదు. ఇప్పటికే రిషభ్ పంత్ ట్రేడ్ డీల్‌లో భాగంగా కుల్దీప్ యాదవ్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు వెళ్లిపోవడంతో... ఢిల్లీ స్పిన్ విభాగం బలహీనపడింది. ఇప్పుడు అక్షర్ కూడా వెళితే ఆ లోటు మరింత పెరుగుతుంది.


అక్షర్‌ను సీఎస్కేకు ఇస్తే.. బదులుగా డెవాల్డ్ బ్రెవిస్ లేదా నూర్ అహ్మద్‌లను ఢిల్లీ కోరుకునే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చెన్నైతో జరిగే ఈ ట్రేడ్‌లో వారిద్దరిలో ఒకరిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించవచ్చు. మరోవైపు ప్రచారంలో ఉన్న వార్తే నిజమై.. అక్షర్ నిష్క్రమిస్తే ఢిల్లీకి కొత్త కెప్టెన్‌ను వెతకాల్సి ఉంటుంది. గతంలో పంత్ జట్టును నడిపినప్పటికీ, అతనికి మళ్లీ కెప్టెన్సీ ఇస్తే బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని అశ్విన్ భావిస్తున్నారు. పంత్‌పై భారం తగ్గించి, అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్‌ను సారథ్య బాధ్యతల్లోకి తీసుకురావడం మంచి ప్రత్యామ్నాయమని అశ్విన్ సూచించారు.


ఇవి కూడా చదవండి:

భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన

41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్..

ఉషకు ఎదురుదెబ్బ

Updated Date - Nov 10 , 2026 | 08:54 AM