బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు.. అసలు వ్యూహాన్ని బయటపెట్టిన టీమిండియా కోచ్!
ABN , Publish Date - Nov 09 , 2026 | 07:13 PM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను, ఆరో స్థానంలో కేఎల్ రాహుల్‌ను పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను, ఆరో స్థానంలో కేఎల్ రాహుల్‌ను పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి రెండు వన్డేల్లో అక్షర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ వ్యూహంపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా దీనిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. అక్షర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపడం వెనుక అసలు కారణాలను వెల్లడించాడు.
‘ఎడమచేతి, కుడిచేతి బ్యాటర్ల కాంబినేషన్‌ను కొనసాగించడం వల్లే అక్షర్ పటేల్‌ను ముందు పంపిస్తున్నాం. అలాగే కేఎల్ రాహుల్ మ్యాచ్‌ను ఫినిష్ చేయగలడన్న నమ్మకం కూడా ఉంది. అక్షర్ గతంలో వన్డేల్లో ఐదో స్థానంలో చాలాసార్లు బ్యాటింగ్ చేశాడు. అతడికి ఆ స్థానంలో ఆడే సామర్థ్యం ఉంది. ఒక వ్యూహం ఫలించకపోతే ఆ ఆటగాడిని ముందుగా ఎందుకు పంపారని ప్రశ్నిస్తారు. అదే వ్యూహం సక్సెస్ అయితే అద్భుతమైన నిర్ణయమని ప్రశంసిస్తారు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కేఎల్ రాహుల్‌లో నాకు నచ్చే అతిపెద్ద లక్షణం అతడి బహుముఖ ప్రజ్ఞ. రెడ్ బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడగలడు. వైట్ బాల్ క్రికెట్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. అవసరమైతే చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్‌ను ఫినిష్ చేయగలడు. ఆ పాత్రలోనూ అతడి రికార్డు చాలా బాగుంది. జట్టు అవసరాలను బట్టి తన ఆటతీరును మార్చుకుంటాడు. నేను జట్టులో చేరినప్పటి నుంచి రాహుల్ బ్యాటింగ్‌లో విఫలమైనట్లు నాకు గుర్తు లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించడు. క్రీజులో చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. చాలా సందర్భాల్లో జట్టును నిరాశపర్చలేదు’ అని కోటక్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్