Share News

అర్జున్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. సచిన్ టెండూల్కర్ భావోద్వేగం

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:57 PM

మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో తన కొడుకు గురించి మాట్లాడుతూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.

అర్జున్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. సచిన్ టెండూల్కర్ భావోద్వేగం
Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ వేడుకల్లో నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకా, అనంత్, రాధికతో సహా అంబానీ కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో సచిన్ తన కుమారుడి వివాహం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.


‘మాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినందుకు అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు. ఒక కొడుకు తను ఇష్టపడిన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడంటే.. వాడు పెరిగి పెద్దవాడయ్యాడని అర్థం. అర్జున్, సానియాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అర్జున్ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. తనను ఎంతగానో ప్రేమించే ఓ ప్రత్యేకమైన వ్యక్తి అర్జున్ జీవితంలోకి రావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ వెల్లడించాడు.


నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘సచిన్, అంజలి టెండూల్కర్‌కు మా కుటుంబానికి ఎంతో గొప్ప అనుబంధం ఉంది. వారు కూడా మా కుటుంబంలో ఒకరు. అనంత్, రాధికల ప్రయాణం కూడా ఇక్కడినుంచే ప్రారంభమైంది. అర్జున్‌ను తమ స్కూల్‌లో చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. సానియా చుట్టూ పాజిటివిటీ ఉంది. వీరు జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలని కోరుకుంటున్నా’ అని నీతా ఆశీర్వదించారు.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 04:33 PM