చెపాక్ స్టేడియంలో ఆ సమస్యకు చెక్.. మైదానంలో ప్రత్యేక రసాయనం స్ప్రే
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:47 PM
పొట్టి ప్రపంచకప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత, జింబాబ్వే జట్లు పోటీ పడనున్నాయి. సెమీస్‌కు అర్హత సాధించాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026 సూపర్-8లో భాగంగా మరికొన్ని గంటల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. ఈ పోరు రాత్రి 7:00 గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు మంచు ప్రభావం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్యూ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా ఉండటం కోసం ‘డ్యూ కూర్’ అనే ప్రత్యేక కెమికల్ ను దిగుమతి చేశారు. ఈ ప్రత్యేక రసాయనాన్ని మైదానంలో స్ర్పే చేయించారు. ఈ కెమికల్‌ను యూఎస్‌ఏ నుంచి తెప్పించినట్లుగా సమాచారం.
'డ్యూ కూర్' కెమికల్‌ను మంగళ, బుధవారాలు మైదానంలో ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌లో సిబ్బంది పిచికారీ చేశారని సమాచారం. మ్యాచ్ జరిగే సమయంలో తేమ శాతం 80 నుంచి 90 వరకు ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే తేమను నియంత్రించడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌లో ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో మంచుతో ఫీల్డింగ్ చేసే జట్టుకు ఇబ్బంది ఉండదు. సాధారణంగా చెపాక్ పిచ్.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.
బ్యాటింగ్‌కు సహకరించినా బ్యాటర్లకు కాస్త ఓపిక అవసరం. అయితే మంచు కురిస్తే మాత్రం బంతి జారుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు టాస్ కీలకంగా మారనుంది. అందుకే జట్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో ఛేజింగ్‌ను ఇష్టపడతాయి. అయితే ప్రస్తుతం ప్రత్యేక రసాయనాన్ని స్ర్పే చేసిన నేపథ్యంలో మంచు ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్