Share News

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:46 AM

పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన భార్య కష్టం తగ్గించేందుకు రెండో పెళ్లి చేసుకుంటానంటూ ఓ టీవీ షోలో సరదాగా వ్యాఖ్యానించాడు.

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
Abdul Razzaq viral video

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లు, మాజీ ఆటగాళ్లు చిత్ర, విచిత్రమైన కామెంట్స్ చేస్తుంటారు. వార్తల్లో నిలవాలని ఇలా చేస్తారో లేక మరే ఉద్దేశంతో చేస్తారో తెలియదు. పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా తరచూ తన వివాదాస్పద, వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో తన భార్య ఆయేషా రజాక్ తో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన వైవాహిక జీవితం, ఇంటి బాధ్యతలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన ఓ విచిత్ర వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


టీవీ షోలో భాగంగా తొలుత ఆయేషా మాట్లాడుతూ.. తన భర్త అబ్దుల్ క్రికెట్‌లో బిజీగా ఉండటం వల్ల ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని తెలిపింది. పిల్లల స్కూల్, పేరెంట్స్ మీటింగ్స్, ఇంటికి అవసరమైన సరకులు తేవడం వంటి పనులన్నీ తాను ఒక్కదాన్నే చక్కబెడతానని వివరించింది. పక్కనే ఉన్న రజాక్ మాట్లాడుతూ... 'నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నావు.


నీ కష్టాన్ని నేను చూడలేను. నీ భారం తగ్గించడానికి నేను రెండో పెళ్లి చేసుకుంటానని ఆయేషాతో చాలాసార్లు చెప్పాను' అని నవ్వుతూ యాంకర్‌ నిదా యాసిర్‌కు చెప్పాడు. రజాక్ మాటలకు హోస్ట్ తోపాటు అక్కడున్న వారంతా నవ్వారు. భార్య ఆయేషా కూడా రజాక్ జోక్‌ను సరదాగా తీసుకుని నవ్వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. భార్య కష్టాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలాంటి జోకులు వేయడం ఏంటని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

శ్రీలంక ఓటమి.. సెమీస్ నుంచి పాకిస్థాన్ ఔట్!

Updated Date - Feb 26 , 2026 | 12:34 PM