ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:39 AM
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డైనమైట్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ దిశగా దూసుకొచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో మాత్రమే విఫలమయ్యాడు. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఇవాళ జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే భారీ విజయాన్ని నమోదు చేయాలి. ఈక్రమంలో టీమిండియా అభిమానుల ఆశలన్నీ విధ్వంసకర ప్లేయర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలపైనే ఉన్నాయి. వీరిద్దరు తమ విధ్వంసకరమైన ఆటను బయటకు తీస్తే.. భారీ స్కోర్ నమోదు కావడం పక్కా అని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే జింబాబ్వే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బూస్ట్ ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది.
తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. గత వారం ఎనిమిదో స్థానంలో ఉన్న కిషన్.. తాజాగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. అలానే వరుస వైఫల్యాల తర్వాత కూడా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నెలబెట్టుకున్నాడు. అయితే అతడి స్థానానికి ముప్పు పొంచి ఉంది. రెండో ప్లేస్‌లో ఉన్న ఫిల్ సాల్ట్‌కు అతనికి మధ్య పాయింట్ల వ్యత్యాసం బాగా తగ్గింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాక్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ తన కెరీర్‌లో తొలిసారి టాప్-3లోకి వచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 లోసెంచరీ చేసినా శ్రీలంక ఆటగాడు నిస్సంక.. తాజాగా ర్యాంకింగ్స్ ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక వర్మ 3 స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెవిస్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 9వ స్థానంలో నిలిచాడు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే... భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరాడు. వెస్టిండీస్ బౌలర్ మాథ్యూ ఫోర్డ్ కూడా ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 7 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, అక్షర్ పటేల్ 10 స్థానాలు కోల్పోయి 20, 24 స్థానాలకు పడిపోయారు.
ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే.. జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా తిరిగి తన నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. పాక్ ఆటగాడు సైమ్ అయూబ్‌ను కిందకు దించి ఈ ఘనత అందుకున్నాడు. టీమండియా ప్లేయర్లలో హార్దిక్ పాండ్య మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శివం దూబే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 7వ స్థానానికి చేరాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంక ఓటమి.. సెమీస్ నుంచి పాకిస్థాన్ ఔట్!
సౌతాఫ్రికా గెలవాలని కోరుకుంటున్న భారత్!