ప్రపంచం ముందు విలన్‌గా అర్జెంటీనా! ఎందుకంటే..
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:57 AM
ప్రపంచకప్ ఫైనల్ పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థి ఆటగాళ్లపై దాడులకు దిగడం వంటి చర్యలతో అర్జెంటీనా టోర్నీలోనే ఒక ‘విలన్’గా మారిందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచకప్ ఫైనల్ పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం, ప్రత్యర్థి ఆటగాళ్లపై దాడులకు దిగడం వంటి చర్యలతో అర్జెంటీనా టోర్నీలోనే ఒక ‘విలన్’గా మారిందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. కేవలం ఫైనల్ మ్యాచ్ సందర్భంగానే కాకుండా.. టోర్నీ ప్రారంభమైన సమయం నుంచి అర్జెంటీనా తీరు.. ఆ జట్టును గ్లోబల్ విలన్ గా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు ట్రోఫీ అందుకుంటున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు వెనక్కి తిరిగి నిలబడటం వివాదాన్ని మరింత రాజేసింది. దీనిపై ది న్యూయార్క్ టైమ్స్ స్పందిస్తూ.. అదొక చెత్త ప్రవర్తన అని, అసహ్యకరమైన ప్రదర్శనగా అభివర్ణించింది. జర్మనీ మాజీ ఆటగాడు థామస్ హిట్జెల్‌స్పెర్గర్ అర్జెంటీనా వైఖరిని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైనదని తీవ్రంగా ఖండించారు. ప్రసిద్ధ వ్యాఖ్యాత పియర్స్ మోర్గన్ స్పందిస్తూ.. 'అర్జెంటీనా ఆటగాళ్ళు.. గెలుపు కోసం కంటే స్పెయిన్ జట్టును వీలైనంత ఎక్కువ దెబ్బతీయడానికే ప్రాధాన్యమిచ్చారు' అని విమర్శించారు.
అయితే ఈ విమర్శలన్నింటినీ అర్జెంటీనా అభిమానులు, స్థానికి మీడియాలు తిప్పికొడుతున్నాయి. ఫుట్‌బాల్‌పై తమకున్న విపరీతమైన ఆరాధన, గెలిచి తీరాలనే కసిని ప్రపంచం ‘అహంకారం’గా పొరబడుతోందని వారు వాదిస్తున్నారు. అర్జెంటీనా పౌరుడైన లియో సిమోన్ మాట్లాడుతూ.. 'ఇది ఫుట్‌బాల్. ఇక్కడ పోరాట సహజం. కొన్ని సందర్భాల్లో దెబ్బలు కూడా తగులుతుంటాయి. ఇవేమి నచ్చకపోతే వాలీబాల్ ఆడుకోవాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతికూలతలు ఎదురైనా మైదానంలో వంద శాతం శ్రమించడమే తమ నైజమని, దేశం పట్ల తమకున్న అంకితభావాన్ని ప్రపంచం అర్థం చేసుకోలేదని అర్జెంటీనా అభిమానులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: