పతక జోరు కష్టమేనా?
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:32 AM
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే విషయంలో ప్రతిసారీ భారత్‌పై అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగ్గట్టే ఈసారి క్రీడల్లో సత్తా చాటేందుకని అథ్లెట్ల శిక్షణ కోసం...
కామన్వెల్త్ క్రీడలు రేపటి నుంచే
ఈసారి షూటింగ్, బ్యాడ్మింటన్,
రెజ్లింగ్, హాకీకి నో చాన్స్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే విషయంలో ప్రతిసారీ భారత్‌పై అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగ్గట్టే ఈసారి క్రీడల్లో సత్తా చాటేందుకని అథ్లెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 53 కోట్లకు పైగానే ఖర్చుచేసింది. అందులో బాక్సింగ్, అథ్లెటిక్స్‌కే సింహభాగం వెచ్చించింది. కానీ, గురువారం నుంచి గ్లాస్గో (స్కాట్లాండ్) వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మాత్రం భారత్ నుంచి మెరుగైన ప్రదర్శనే తప్ప మరీ ఎక్కువగా పతకాలు ఆశించే పరిస్థితులు లేవు. ఎందుకంటే, ఈసారి క్రీడల్లో నిర్వాహకులు కేవలం 10 క్రీడాంశాలకు మాత్రమే చోటు కల్పించారు. మనోళ్లు ఎక్కువగా పతకాలు కొల్లగొట్టే షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌తోపాటు హాకీ విభాగాలను గ్లాస్గో ఈవెంట్ నుంచి తప్పించారు. దీంతో పారా అథ్లెట్లతో కలిపి ఓవరాల్‌గా 125 మంది సభ్యులతో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేతృత్వంలోని 32 మందితో కూడిన అథ్లెటిక్స్ బృందంపైనే భారత్ ఆశలన్నీ. కాగా, అమెరికా, స్విట్జర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా.. ఇలా విదేశాల్లో అథ్లెట్ల శిక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసింది. బాక్సింగ్‌లో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరి శిక్షణ కోసం రూ. 10 కోట్లు వినియోగించారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సహా 12 మంది వెయిట్ లిఫ్టర్ల శిక్షణ కోసం రూ. 7.5 కోట్లు వెచ్చించారు. కాగా, పతకాలు అలవోకగా లభించే చాలా ఈవెంట్లు టోర్నీలో లేకపోవడంతో భారత్‌కు ఈసారి పతకాల పంట కష్టమేననిపిస్తోంది.
‘ముగింపు’లో రష్మిక, మహదేవన్
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల ముగింపు కార్యక్రమంలో నటి రష్మిక మందన్న, ప్రఖ్యాత సింగర్ శంకర్ మహదేవన్ పాల్గొననున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్ పతాకాన్ని భారత్‌కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పనుంది. దీంట్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా
రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి