లఖ్‌నవూతో మ్యాచ్.. సీఎస్కేలో అనుభవజ్ఞులే కనిపించలేదు: అంబటి రాయుడు
ABN , Publish Date - May 16 , 2026 | 06:15 PM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, పూరన్.. కాంబోజ్‌ను టార్గెట్ చేసి విజృంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకెళుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. శుక్రవారం 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూపై సీఎస్కే ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. అయితే సీఎస్కే స్టార్ పేసర్ అన్షుల్ కాంబోజ్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 2.4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఎల్ఎస్‌జీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, పూరన్.. కాంబోజ్‌ను టార్గెట్ చేసి విజృంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘లఖ్‌నవూ మ్యాచ్ సమయంలో సీఎస్కే జట్టును చూస్తే ఆటను నియంత్రించే అనుభవజ్ఞులు మైదానంలో ఉన్నట్లు అనిపించలేదు. అన్షుల్ కాంబోజ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో అతడికి మార్గనిర్దేశం చేసే సీనియర్ల కొరత జట్టులో స్పష్టంగా కనిపించింది. మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతూ కాంబోజ్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. అలాంటి సమయంలో ఎవరైనా అనుభవజ్ఞుడు అతడి వద్దకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సింది. అతడి దగ్గరకి వెళ్లి..‘కాస్త ప్రశాంతంగా ఉండు.. ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేయ్.. నీకు మేమున్నాం’ అనే భరోసా ఇవ్వాల్సింది. వికెట్ కీపింగ్ చేస్తోన్న సంజు శాంసన్ కూడా ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించలేదు. స్లో బాల్ వేయాలా? యార్కర్ వేయాలా? వంటి సూచనలు ఇచ్చి కాంబోజ్ ఆలోచనలను కాస్త మళ్లించే ప్రయత్నం చేయాల్సింది. అన్షుల్ ఈ సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనలు చేశాడు. అతడికి లఖ్‌నవూతో మ్యాచ్ ఓ పీడకల. అన్షుల్ వేసిన బంతుల్లో ఎలాంటి తప్పు లేదు. మార్ష్ బ్యాటింగ్ కారణంగానే భారీ షాట్లు వచ్చాయి’ అని రాయుడు వివరించాడు.
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి