ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం
ABN , Publish Date - May 16 , 2026 | 04:13 PM
ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. రెండు హోం వేదికలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఆ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకునే తొలి జట్టుగా నిలుస్తుందనుకున్న పంజాబ్.. టోర్నీ నుంచే నిష్క్రమించే పరిస్థితికి చేరుకుంది. వరుసగా ఐదు ఓటములను నమోదు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. రెండు హోం వేదికలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఆ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టుకు రెండు వేర్వేరు హోం వేదికలను ఎంపిక చేయడం సరైన విధానం కాదని తెలిపాడు.
‘కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్.. వంటి విజయవంతమైన జట్లు తమ హోం మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడుతున్నాయి. పంజాబ్ మాత్రం ముల్లాన్‌పూర్, ధర్మశాల వేదికలను ఎంచుకుని.. అటుఇటు మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వేదికపై ఐదు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత మరో వేదికకు మారిన పంజాబ్.. టోర్నీ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితికి వచ్చింది. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం అస్సలు సరైంది కాదు. ఇది జట్టు ప్రదర్శనలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ అజేయంగా నిలిచింది. కానీ ధర్మశాల పిచ్ పరిస్థితులు జట్టుకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అక్కడ బ్యాటింగ్ అంత సులువుగా ఉండదు. పిచ్‌కు అలవాటు పడేలోపే జట్టు 20-40 పరుగులు తక్కువ చేస్తోంది. పంజాబ్ వరుసగా ఓడిపోవడానికి కేవలం కెప్టెన్సీ, జట్టు వైఫల్యం కారణంగా చూడకూడదు. వేదిక మార్పు కూడా ప్రధాన కారణాల్లో ఒకటి’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆర్సీబీతో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి