Share News

నేపాల్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఇవ్వాలి.. ఐసీసీకి ఆకాశ్ చోప్రా కీలక సూచన

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:30 PM

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమ వీరోచిత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ జట్టుకు చెమటలు పట్టించింది. అయితే నేపాల్ జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు.

నేపాల్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఇవ్వాలి.. ఐసీసీకి ఆకాశ్ చోప్రా కీలక సూచన
Aakash Chopra

ఇంటర్నెట్ డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో తక్కువ అంచనాలున్న జట్లలో నేపాల్ ఒకటి. పెద్ద జట్లకు కనీస పోటీ ఇస్తుందని కూడా ఎవరూ అనుకోరు. కానీ టోర్నీలో తన తొలి మ్యాచులోనే రెండుసార్లు ఛాంపియన్ ఇంగ్లండ్‌ను వణికించింది. దాదాపు ఇంగ్లండ్ జట్టును ఓడించినంత పని చేసింది. ఆఖరి బంతి వరకు పోరాడి ఓడింది. అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొన్న ఇంగ్లండ్.. ఓటమి అంచుల్లో నుంచి అతికష్టం మీద బయటపడింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టు(Nepal T20 World Cup) కేవలం 4 పరుగుల తేడాతో ఓడింది. అయితే నేపాల్ జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు.


‘వరల్డ్‌ కప్‌ల సమయంలో మాత్రమే అసోసియేట్ జట్లను గుర్తుచేసుకుని ఆ తర్వాత పూర్తిగా మర్చిపోవడం సరైంది కాదు. నేపాల్ వంటి జట్లకు కేవలం ప్రశంసలతో సరిపెట్టకుండా ఐసీసీ మరిన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు, రెగ్యులర్ టోర్నీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసోసియేట్ లేదా తక్కువ ర్యాంక్ జట్ల విషయంలో మనం చేస్తున్నది కేవలం టోకెన్ పార్టిసిపేషన్. ఇది నిజమైన ప్రోత్సాహం కాదు. రెండు సంవత్సరాలకు ఒకసారి వాళ్లు బాగా ఆడితే ప్రశంసించి తర్వాత మరిచిపోతాం. పెళ్లికి వచ్చి వెళ్లిపోయిన అతిథుల్లా వాళ్లను చూస్తున్నాం. టోర్నీ అయిపోయాక వాళ్లు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు. ప్రతి వరల్డ్‌ కప్‌లో ఈ కథే వినిపిస్తుంది. గెలిస్తే మాట్లాడతాం.. ఆనందిస్తాం.. తర్వాత పూర్తిగా మరిచిపోతాం. మనం మాత్రం మన ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుకుంటూ ముందుకు వెళ్లిపోతాం. వాళ్ల గురించి పట్టించుకునేవాళ్లే ఉండరు’ అని చోప్రా వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 01:23 PM