అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు.. సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టి..!
ABN , Publish Date - Oct 11 , 2026 | 09:29 PM
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20ల్లో 2,000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు అభిషేక్ కేవలం 1,024 బంతులే ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. సూర్య 1,164 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. తాజాగా అభిషేక్ అతడిని అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.
మరో రికార్డు..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరో ఘనత సాధించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వెస్టిండీస్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్(15 బంతుల్లో) అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ బ్యాటర్ టిమ్ డేవిడ్(16 బంతులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్, కొలిన్ మున్రో, అభిషేక్ శర్మ.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2,000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 4,231 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 4,188, సూర్యకుమార్ యాదవ్ 3,272, హార్దిక్ పాండ్య 2,288, కేఎల్ రాహుల్ 2,265 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు