భువీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: సురేశ్ రైనా
ABN , Publish Date - Oct 11 , 2026 | 07:58 PM
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా హర్షం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా హర్షం వ్యక్తం చేశాడు. అతడి కష్టం, క్రమశిక్షణకు తగిన ప్రతిఫలం లభించిందని ప్రశంసించాడు. భారత సాఫ్ట్‌బాల్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ లీగ్‌కు అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
‘జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న భువీకి శుభాకాంక్షలు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం అంత సులువైన విషయం కాదు. న్యూజిలాండ్ పర్యటనలోనూ భువీ అద్భుతంగా రాణించాలి. ఇటీవలే నేను అతడితో మాట్లాడాను. క్రికెట్ పట్ల అతడికి ఉన్న అంకితభావం చూసి ముచ్చటేసింది. కష్టపడితే ఫలితం కచ్చితంగా దక్కుతుంది. అందుకు భువీనే నిదర్శనం’ అని రైనా వెల్లడించాడు.
భారత క్రికెట్‌లో పెరిగిన పోటీ!
‘భారత ప్లేయర్ల విభిన్న శైలిలో బ్యాటింగ్ చేస్తూ క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతుంటే.. శుభ్‌మన్ గిల్ మరో తరహా ఆటతో ఆకట్టుకుంటున్నాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమదైన శైలిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం జట్టులో భయపడకుండా ఆడే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు విజయాల్లో భాగస్వాములవుతున్నారు. భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. దేశంలో నాలుగైదు జట్లకు సరిపడా నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు’ అని రైనా వివరించాడు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు