ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి 21 మంది మాజీ కెప్టెన్ల లేఖ
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:28 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది అంతర్జాతీయ క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది అంతర్జాతీయ క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్య చికిత్స అందించడంతో పాటు.. జైలులో ఆయన సంక్షేమాన్ని నిర్ధారించాలని వారు పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆరు నెలల క్రితం 14 మంది మాజీ కెప్టెన్లు ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణ వైద్య సహాయం అందించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా మరో ఏడుగురు ఈ విజ్ఞప్తికి జత కావడంతో మొత్తం సంతకాల సంఖ్య 21కు చేరింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, భారత్ వంటి దేశాలకు చెందిన మాజీ కెప్టెన్లు కూడా ఉన్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించిందని మాజీ కెప్టెన్లు తమ లేఖలో పేర్కొన్నారు. ఆయన వ్యక్తిగత వైద్యులు, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ కూడా ఉండే మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించినట్లు తెలిపారు. అలాగే వారానికి ఒకసారి కుటుంబ సభ్యుల భేటీకి కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే ఉన్నారని.. కోర్టు సూచించిన బోర్డుకు బదులుగా ప్రభుత్వ నియమిత వైద్య బృందం పరీక్షలు నిర్వహించి, ఆయనను ‘వైద్యపరంగా ఫిట్’గా ప్రకటించి తిరిగి జైలుకు పంపిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కోర్టు ఆదేశాల ఉద్దేశానికి అనుగుణంగా లేదని ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, న్యాయ బృందం చెబుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
మూడు కీలక డిమాండ్లు
పాకిస్థాన్ న్యాయ వ్యవస్థలో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేసిన మాజీ కెప్టెన్లు.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో మూడు ప్రధాన డిమాండ్లు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశించిన మెడికల్ బోర్డు.. ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యులతో కలిసి స్వతంత్రంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
కోర్టు ఆదేశించిన వారానికొకసారి కుటుంబ సభ్యుల భేటీలకు ఎలాంటి అంతరాయం లేకుండా అనుమతి ఇవ్వాలి.
మెడికల్ బోర్డు సూచించే చికిత్సను వెంటనే అందించాలి.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?
ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ చారిత్రాత్మక ఘనత