Share News

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:56 PM

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది.

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత
ICC Test Rankings

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ చరిత్రలో బంగ్లా జట్టు 9వ స్థానం కంటే పైకి రావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ ఖాతాలో ప్రస్తుతం 78 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకోవడం విశేషం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. సౌతాఫ్రికా(119), న్యూజిలాండ్(106), భారత్(104), ఇంగ్లండ్(99) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఆసీస్‌లో మరిన్ని టెస్టులు ఆడాలి..

ఈ ఘనతపై బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్పందించాడు. ‘టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకోవడం భారీ విజయమే. అయితే ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో మేం మరింత మెరుగ్గా ఆడి ఉంటే ఇంకా బాగుండేది’ అని శాంటో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ 1-1తో సమం చేసింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఆడటం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.


‘23 ఏళ్ల తర్వాత మేం ఇక్కడికి వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి నాణ్యమైన జట్టుపై ఆడటం అంత సులభం కాదు. మేం తరచూ ఇక్కడికి వస్తే ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన వస్తుంది. అనుభవం పెరుగుతుంది. 23 లేదా 25 ఏళ్ల తర్వాత కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో తరచూ ఆడాలని కోరుకుంటున్నాం’ అని శాంటో చెప్పాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల కోసం కూడా బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియా పర్యటనలు చాలా అరుదు. బంగ్లాదేశ్ చివరిసారిగా 2008లో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో టీ20 అంతర్జాతీయ సిరీస్ కూడా ఆడలేదు.


ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?

Updated Date - Aug 23 , 2026 | 04:57 PM