Share News

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?

ABN , Publish Date - Aug 23 , 2026 | 02:40 PM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరులో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ నిరాశపరిచాడు.

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరులో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ నిరాశపరిచాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన అతడు.. కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైభవ్.. రెండో ఓవర్‌లో పేసర్ బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి దూకుడుకు బ్రేక్ పడింది. ఆఫ్ స్టంప్‌కు వెలుపల బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో పడిన బంతిని వైభవ్ బలంగా కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి గల్లీలో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో 6 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈస్ట్ జోన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.


ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇంకా మెరుగవ్వాలి..

బిహార్ తరఫున ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 12 ఇన్నింగ్స్‌ల్లో 17కు పైగా సగటుతో మంచి ఇన్నింగ్సే ఆడాడు. అతడి అత్యధిక స్కోరు 93 పరుగులు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం వైభవ్ మంచి ప్రభావం చూపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాడు. జింబాబ్వే పర్యటనలో మాత్రం వైభవ్ అదరగొట్టాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 151 పరుగులు, రెండు అర్ధ సెంచరీలు, 50.33 సగటు, 196.10 స్ట్రైక్‌రేట్‌తో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో అతడు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. అయితే టీ20ల్లో రాణిస్తోన్న వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

Updated Date - Aug 23 , 2026 | 02:40 PM