శీతల పానీయానికో మ్యూజియం
ABN , Publish Date - Mar 29 , 2026 | 10:27 AM
తలనొప్పి, న్యూరాల్జియా వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం తయారుచేసిన పానీయం అది. కానీ కాలక్రమంలో సాఫ్ట్‌డ్రింక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది... అదే ‘కోకా కోలా’. అట్లాంటాలోని మ్యూజియంలోకి అడుగుపెడితే 140 ఏళ్ల కోకా కోలా కంపెనీ చరిత్ర కళ్లకు కడుతుంది.
తలనొప్పి, న్యూరాల్జియా వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం తయారుచేసిన పానీయం అది. కానీ కాలక్రమంలో సాఫ్ట్‌డ్రింక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది... అదే ‘కోకా కోలా’. అట్లాంటాలోని మ్యూజియంలోకి అడుగుపెడితే 140 ఏళ్ల కోకా కోలా కంపెనీ చరిత్ర కళ్లకు కడుతుంది. మరి... మ్యూజియంలోకి వెళ్లొద్దామా....
‘ది వరల్డ్ ఆఫ్ కోకా కోలా’... అట్లాంటాలో ఉన్న కోకా కోలా మ్యూజియం ఇది. అమెరికా ఫేవరేట్ సాఫ్ట్‌డ్రింక్‌గా గుర్తింపు పొందిన పానీయం కోకా కోలా. దీని చరిత్ర, సంస్కృతి గురించి ఈ మ్యూజియంలో వివరంగా తెలుసుకోవచ్చు. 20 ఎకరాల కాంప్లెక్స్‌లో ఇది విస్తరించి ఉంది. కోకా కోలా డ్రింక్‌ను 1886లో ఫార్మసిస్ట్ డా. జాన్ పెంబెర్టన్ తయారుచేశారు. నర్వ్ టానిక్‌గా తలనొప్పి, న్యూరాల్జియా సమస్యల నుంచి విముక్తి కోసం దీన్ని తయారుచేశారు. 1903లో ఇందులో ఉన్న కొకైన్‌ను తొలగించారు. అయితే డా. జాన్ బుక్‌కీపర్ ‘కోకా కోలా’ పేరును సూచించి, ఐకానిక్ లోగోను తయారు చేసి క్రెడిట్‌ను మొత్తం తీసేసుకున్నారు. 1886లో అట్లాంటా జర్నల్‌లో మొదటిసారి దీని గురించి ప్రకటన ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది కోకా కోలా కంపెనీగా నమోదయ్యింది. 50 ఏళ్లు పూర్తయ్యే సమయానికి అమెరికాకు నేషనల్ ఐకానిక్ డ్రింక్‌గా మారింది.
డాక్యుమెంటరీ ప్రదర్శన...
ఈ మ్యూజియం డోర్స్‌ని ప్రతీ 9 నిమిషాలకొకసారి తెరుస్తారు. నలభై నుంచి యాభై మంది వరకు లోపలకు అనుమతిస్తారు. ఎంట్రీ లాంజ్‌లో కార్వింగ్ చేసి ఉన్న బాటిల్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మ్యూజియం లోపలికి అడుగుపెట్టగానే కోకా కోలా బ్రాండ్ నుంచి వెలువడిన రకరకాల ఉత్పత్తులను చూడొచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం కోకాకోలా ఎలా ఉండేదో ఇక్కడ కళ్లకు కట్టినట్టు చూడొచ్చు. మ్యూజియంలో థియేటర్ కూడా ఉంది. అక్కడ సందర్శకుల కోసం పది నిమిషాల పాటు కోకాకోలా డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. వివిధ దేశాల్లోని వార్తా పత్రికల్లో కోకాకోలా ఇచ్చిన ప్రకటనల క్లిప్పింగ్స్‌ను మ్యూజియంలో చూడొచ్చు. ఒకప్పుడు కోకా కోలా సీసాలు పట్టుకుని వెళ్లేందుకు ఉపయోగించిన హ్యాండీ సిక్స్ బాక్స్ కార్టన్ పాత జ్ఞాపకాలను కళ్ల ముందుంచుతుంది. శతాబ్ద కాలంలో కోకా కోలా తయారుచేసిన రకరకాల డ్రింక్ క్యాన్స్, సీసాలను ఇక్కడ చూడొచ్చు. కొన్ని వందల రకాల సీసాలు మ్యూజియం డిస్‌ప్లేలో సందర్శకులకు కనువిందు చేస్తాయి. థమ్సప్, లిమ్కా, ఫాంటా, మాజా, కోకాకోలా పేర్లతో కొన్ని డ్రింక్స్ మనదేశంలో అందుబాటులో ఉన్నాయి.
రుచి చూడొచ్చు...
కోకా కోలా రూపొందించే అన్ని రకాల డ్రింక్స్ రుచులను ఇక్కడ ఆస్వాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో బాగా పాపులర్ అయిన కోకాకోలా డ్రింక్‌లు ఇక్కడ ఒకేచోట లభిస్తాయి. ఇండియాలో పాపులర్ అయిన థమ్సప్... గ్రీస్, థాయ్‌లాండ్, నార్త్ అమెరికాలో ప్రాచుర్యం పొందిన ఫాంటా... ఇలా రకరకాల దేశాల్లో పాపులర్ అయిన డ్రింక్స్‌ను ఇక్కడ టేస్ట్ చేయవచ్చు. కావాల్సినంత డ్రింక్ ఉచితంగానే తాగొచ్చు. మొత్తంగా ఇక్కడ 60 రకాల కోక్ డ్రింక్స్ రుచి చూడొచ్చు. కోకా కోలా తయారుచేసే డ్రింక్‌లకు సంబంధించిన ఐకానిక్ ఫార్ములా ‘మర్చండైజ్ 7ఎక్స్’ను ఒక వాల్ట్‌లో భద్రపరిచారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మొట్టమొదటి సాఫ్ట్ డ్రింక్ కూడా ఇదే కావడం విశేషం. వ్యోమగాముల కోసం 1985లో ఒక ప్రత్యేకమైన క్యాన్‌ను రూపొందించారు. ఛాలెంజర్ స్పేస్ షటిల్‌లో ఉన్న వ్యోమగాములు ఈ సాఫ్ట్‌డ్రింక్ క్యాన్‌లను స్పేస్‌లోకి తీసుకెళ్లి సిప్ చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక శీతలపానీయానికి కూడా మ్యూజియం ఉండటం విశేషమే కదా.
మరిన్ని విశేషాలు...
ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో కోకా కోలా ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.
200కు పైగా దేశాల్లో దొరుకుతున్నా రెండు దేశాల్లో మాత్రం ఈ డ్రింక్ చూద్దామన్నా కనిపించదు. అవి ఉత్తర కొరియా, క్యూబా. ఈ రెండు దేశాల్లో కోకా కోలా పూర్తిగా నిషేధం.
కోకా కోలాను ప్రపంచంలో ఎక్కువగా తాగుతున్నది మెక్సికో దేశస్థులు.
కోకా కోలాకు మెక్‌డోనాల్డ్ సంస్థ అతి పెద్ద రెస్టారెంట్ కస్టమర్.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
Read Latest Telangana News and National News